హుస్నాబాద్ రోడ్డు ప్రమాదం, NewzFast Telugu (హుస్నాబాద్, సిద్దిపేట): సిద్దిపేట-హుస్నాబాద్ ప్రధాన రహదారిపై హుస్నాబాద్ మండలం పందిళ్ల గ్రామ శివారులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తండ్రీకూతురు మృతి చెందారు. ఈ ఘటనపై హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే శ్రీ వొడితల సతీష్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన పైడిపల్లి శ్రీకాంత్ (33), ఆయన కుమార్తె మహాన్వి (9) ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఒకే కుటుంబానికి చెందిన తండ్రీకూతురు ఇద్దరూ మృతి చెందడం అత్యంత బాధాకరమని సతీష్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.
పండుగ వేళ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాల్సిన సమయంలో ఈ విషాదం చోటుచేసుకోవడం తీరని లోటని ఆయన పేర్కొన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు తన సానుభూతిని తెలియజేస్తూ, ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.
ఈ ప్రమాదంలో గాయపడిన తల్లి త్వరగా కోలుకోవాలని ఆయన భగవంతుడిని ప్రార్థించారు. రోడ్డు ప్రయాణాల్లో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తూ సురక్షిత ప్రయాణం చేయాలని ఆయన సూచించారు.




