జీటీఏ 6 ప్రీ-ఆర్డర్లు, NewzFast Telugu: గేమింగ్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘గ్రాండ్ థెఫ్ట్ ఆటో 6’ (జీటీఏ 6) సరికొత్త రికార్డులు సృష్టించే దిశగా దూసుకుపోతోంది. నవంబర్ 19న అధికారికంగా మార్కెట్లోకి రానున్న ఈ గేమ్, విడుదలకు ముందే ఊహించని స్థాయిలో ముందస్తు ఆర్డర్లను సొంతం చేసుకుంటోంది.
ప్రముఖ డిజిటల్ మార్కెట్ అనలిటిక్స్ సంస్థ ‘సెన్సార్ టవర్’ తాజా అంచనాల ప్రకారం, ఇప్పటివరకు సుమారు 96.9 లక్షల (9.69 మిలియన్లు) డిజిటల్ కాపీలు అమ్ముడయ్యాయి. వీటి ద్వారా దాదాపు 942 మిలియన్ డాలర్ల (సుమారు రూ.7,800 కోట్లకు పైగా) ఆదాయం వచ్చినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
గేమింగ్ ప్లాట్‌ఫామ్‌ల పరంగా చూస్తే, సోనీ ప్లేస్టేషన్ 5 (PS5) యూజర్ల నుంచే అత్యధిక స్పందన వచ్చింది. మొత్తం ప్రీ-ఆర్డర్లలో దాదాపు 74 నుంచి 75 శాతం బుకింగ్స్ పీఎస్ 5 నుంచి నమోదు కాగా, మిగిలిన 25 నుంచి 26 శాతం ఆర్డర్లు ఎక్స్‌బాక్స్ సిరీస్ ఎక్స్/ఎస్ (Xbox Series X|S) కన్సోళ్ల నుంచి వచ్చాయి.
అంతేకాకుండా, గేమ్ కొనుగోలు చేసిన వారిలో దాదాపు 89 శాతం మంది 100 డాలర్ల విలువైన ప్రీమియం ‘అల్టిమేట్ ఎడిషన్’కే ప్రాధాన్యత ఇచ్చారు. 80 డాలర్ల బేసిక్ ఎడిషన్ కంటే ఎక్కువ ఫీచర్లు ఉన్న ఈ వర్షన్‌వైపే గేమర్లు మొగ్గు చూపారు.
ఈ అపూర్వ స్పందనపై గేమ్‌ను విడుదల చేస్తున్న టేక్-టూ ఇంటరాక్టివ్ సంతృప్తి వ్యక్తం చేసింది. ముందస్తు ఆర్డర్లు తమ అంతర్గత అంచనాలను మించిపోయాయని కంపెనీ సీఈవో స్ట్రాస్ జెల్నిక్ ధ్రువీకరించారు.
అయితే అధికారిక సేల్స్ గణాంకాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.




