గ్రూప్-1 ఎన్వోసీ నిబంధనలు, NewzFast Telugu (అమరావతి): ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ గ్రూప్-1కు దరఖాస్తు చేసుకున్నవారు ఏపీపీఎస్సీ పెట్టిన నిబంధనలతో ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల విడుదలైన గ్రూప్-1 నోటిఫికేషన్లో పెట్టిన నిబంధనకు, ఆ తర్వాత దరఖాస్తు సమయంలో పెట్టిన నిబంధనలకు పొంతన లేకపోవడమే దీనికి కారణం.
ప్రభుత్వ ఉద్యోగులు, అటానమస్ సంస్థల ఉద్యోగులు, ఎయిడెడ్ సంస్థల్లో శాశ్వత ఉద్యోగులుగా లేదా తాత్కాలిక విధానంలో పనిచేస్తున్నవారు తమ శాఖ ప్రధాన కార్యాలయానికి రాతపూర్వకంగా సమాచారం ఇవ్వాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అయితే ఏపీపీఎస్సీ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకునే సమయంలో శాఖ నుంచి ఎన్వోసీ ఉందా లేదా అని అడిగే ఆప్షన్ పెట్టారు.
ఉంది అనే ఆప్షన్ ఎంచుకున్నవారి నుంచే దరఖాస్తులు స్వీకరించారు.
ఎన్వోసీ లేకపోయినా దరఖాస్తు తిరస్కరిస్తారని ఉందన్నట్లుగా చాలామంది ఉద్యోగులు ‘ఎస్’ ఆప్షన్ ఎంచుకుని దరఖాస్తులు సమర్పించారు. ఉద్యోగాల భర్తీ తుది దశలో జరిగే సర్టిఫికెట్ల పరిశీలన సమయంలో ఎన్వోసీ కావాలని పట్టుబడితే ఏం చేయాలనే ఆందోళన వారిలో నెలకొంది.
కొన్ని శాఖలు నెలల తరబడి ఎన్వోసీ ఫైళ్లను పెండింగ్లో పెడుతున్నందున ఈ ఆందోళన మరింత పెరిగింది.
మరోవైపు, మహిళా శిశు సంక్షేమ శాఖలో గ్రేడ్-2 జిల్లా ప్రొబేషన్ ఆఫీసర్ పోస్టుకు దరఖాస్తు చేసుకునేందుకు ఎమ్మెస్సీ సైకాలజీ చదివినవారికి కూడా అవకాశం ఇవ్వాలని అభ్యర్థులు కోరుతున్నారు. నోటిఫికేషన్లో ఎంఏ సైకాలజీ ఉండాలని పేర్కొనగా, కొన్ని యూనివర్సిటీల్లో ఎమ్మెస్సీ సైకాలజీ మాత్రమే అందుబాటులో ఉన్నందున అది చదివినవారు అనర్హులవుతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.




