గ్రూప్-1 డీఎస్పీ నియామకాలు, NewzFast Telugu (హైదరాబాద్): తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ (టీజీపీఏ)లో శిక్షణ పొందుతున్న గ్రూప్-1 ట్రైనీ డీఎస్పీల ప్రాథమిక పరీక్ష ఫలితాలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఎంపికైన మొత్తం 112 మంది ట్రైనీ డీఎస్పీలలో 40 మందికి పైగా, దాదాపు 35 శాతం మంది, ఫెయిల్ కావడంపై బీఆర్‌ఎస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
పది నెలల పాటు కఠిన శిక్షణ పొందినప్పటికీ, 10 సబ్జెక్టులలో 1,600 మార్కులకు గాను కనీస అర్హత మార్కులైన 50 శాతాన్ని కూడా సాధించలేకపోయారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు. టీజీపీఎస్సీ మూల్యాంకన విధానంలో నియామకాల్లోనే భారీ అక్రమాలు జరిగి ఉండవచ్చని ఆయన ఆరోపించారు.
ఈ పరిణామాలపై టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశంను మంగళవారం శ్రవణ్ నేతృత్వంలో బీఆర్‌ఎస్ నాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ బృందంలో బీఆర్‌ఎస్వీవీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, తుంగ బాలు, సతీశ్ ఉపేంద్ర, కొడంగల్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
పోలీస్ అకాడమీ పరీక్షల మూల్యాంకనం సాధారణంగా ఉదారంగా ఉంటుందని, అలాంటిచోట ఇంత భారీ సంఖ్యలో అధికారులు ఫెయిల్ కావడం వ్యవస్థాగత లోపాలను సూచిస్తోందని శ్రవణ్ విమర్శించారు. ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలో ఫౌండేషన్ శిక్షణ పొందుతున్న ఇతర గ్రూప్-1 అధికారుల్లోనూ ఇదే తరహా పరిస్థితులు కనిపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
జాయింట్ డైరెక్టర్ వంటి కీలక పోస్టులు ఖాళీగా ఉండటం వల్ల శిక్షణ లోపించిందా, లేక గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష అసలైన ప్రతిభను గుర్తించలేకపోయిందా, లేదా మూల్యాంకనం, మార్కుల కేటాయింపులో అక్రమాలు జరిగాయా అని శ్రవణ్ ప్రశ్నించారు. గతంలో హైకోర్టు లేవనెత్తిన ప్రైవేట్ ట్యూటర్ల మూల్యాంకనం, కొన్ని పరీక్షా కేంద్రాల నుంచే ఎక్కువ మంది ఎంపిక కావడంపై అంశాలను గుర్తుచేస్తూ, ఫెయిల్ అయిన అభ్యర్థుల మూల్యాంకన వివరాలు, బయోమెట్రిక్ రికార్డులు, మార్కుల వ్యత్యాసాలపై సమగ్ర ఆడిట్ చేయాలని కోరారు.
నిజానిజాలు తేల్చేందుకు సిట్టింగ్ హైకోర్టు న్యాయమూర్తి, ఫోరెన్సిక్ స్టాటిస్టిషియన్‌తో స్వతంత్ర న్యాయ విచారణ ప్యానెల్ ఏర్పాటు చేసి 90 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని శ్రవణ్ డిమాండ్ చేశారు. 563 గ్రూప్-1 పోస్టుల శిక్షణ రికార్డులను పరిశీలించాలని, జవాబు పత్రాలు, ఎవాల్యుయేటర్ లాగ్స్, బయోమెట్రిక్, సీసీటీవీ డేటాను వెంటనే స్వాధీనం చేసుకోవాలని స్పష్టం చేశారు.
ఈ వినతిపై 15 రోజుల్లోగా స్పష్టమైన నిర్ణయం వెల్లడించకపోతే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని బీఆర్‌ఎస్ నాయకులు హెచ్చరించారు.




