గొర్రెలు మేకల పెంపకందారులు, NewzFast Telugu (తుంగతుర్తి): ఎల్‌నినో ప్రభావంతో తీవ్రంగా నష్టపోతున్న గొర్రెలు, మేకల పెంపకందారులైన యాదవులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని జీఎంపీఎస్ (గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం) జిల్లా అధ్యక్షులు కడెం లింగయ్య యాదవ్ డిమాండ్ చేశారు.
మద్దిరాల మండల కేంద్రంలో జీఎంపీఎస్ మండల అధ్యక్షులు గుండాల లింగయ్య యాదవ్‌తో కలిసి గొర్రెలు, మేకల పెంపకందారుల స్థితిగతులపై సమగ్ర సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్‌నినో ప్రభావంతో పశువుల పెంపకందారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
యాదవుల కోసం సమీకృత గొర్రెల షెడ్లు ఏర్పాటు చేయడంతో పాటు, పశువుల తాగునీటి అవసరాల కోసం నీటి తొట్లు నిర్మించాలని కోరారు. గొర్రెలు, మేకల పెంపకందారులు పాముకాటు, పిడుగుపాటు వంటి ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారని, ప్రమాదవశాత్తు మరణించిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించాలని డిమాండ్ చేశారు.
యాదవ కుటుంబాల భద్రత కోసం అర్హులైన వారికి ప్రభుత్వ ఖాళీగా ఉన్న వెటర్నరీ శాఖ ఉద్యోగాల్లో అవకాశం కల్పించాలని, దళిత బంధు తరహాలో యాదవ బంధు పథకాన్ని ప్రవేశపెట్టాలని కోరారు. అదేవిధంగా 50 సంవత్సరాలు నిండిన యాదవులకు వృద్ధాప్య పెన్షన్ మంజూరు చేయాలని, గొర్రెలు, మేకల మేత కోసం ప్రభుత్వ భూములు, దేవాలయ మాన్యాలను సొసైటీలకు అప్పగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో జీఎంపీఎస్ మండల కార్యదర్శి భూతం వీరయ్య, కాంగ్రెస్ పార్టీ మండల సేవాదళ్ అధ్యక్షులు వల్ల రమేష్ యాదవ్, పాక రవి, మేకల లింగయ్య, మేకల ఉమేష్, గాడిదల జంపయ్య, పోతరాజు లింగయ్య, వల్లపు లింగయ్య తదితరులు పాల్గొన్నారు.




