గొల్లగుప్ప బాలిక మృతి హైకోర్టు, NewzFast Telugu (పోలవరం జిల్లా, ఎటపాక మండలం): మలేరియా మాత్రలు వికటించి బాలిక మృతి చెందిన ఘటనను అధికారులు సీరియస్గా తీసుకున్నట్లు కనిపించడం లేదని హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది.
ఈ ఘటనపై ఎస్ఐ స్టేటస్ రిపోర్ట్ దాఖలు చేయడంపై ధర్మాసనం మండిపడింది. కనీసం డీఎస్పీ లేదా ఎస్పీ స్థాయి అధికారి దాఖలు చేయాల్సిన నివేదికను ఎస్ఐ సమర్పించడం కోర్టు పట్ల అవిధేయత ప్రదర్శించడమేనని వ్యాఖ్యానించింది.
బాలిక మృతికి సంబంధించిన కారణాలు నివేదికలో లేవని, మృతురాలి వైద్య రికార్డులు, ఫోరెన్సిక్ నివేదికను జత చేయకపోవడంపై ధర్మాసనం అభ్యంతరం తెలిపింది. ఈ వ్యవహారంపై తీసుకున్న చర్యలను అఫిడవిట్ రూపంలో సమర్పించాలని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి, పోలవరం జిల్లా డీఎంహెచ్వో, ఎస్పీని ఆదేశించింది.
పోలవరం జిల్లా డీఎంహెచ్వో, ఎస్పీని వ్యాజ్యంలో ప్రతివాదులుగా చేర్చిన ధర్మాసనం, తదుపరి విచారణను పది రోజులకు వాయిదా వేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసాగిల్, జస్టిస్ చల్లా గుణరంజన్తో కూడిన ధర్మాసనం బుధవారం ఈ ఉత్తర్వులు ఇచ్చింది.
సెప్టెంబరు 1న గొల్లగుప్పలో మలేరియా మాత్రలు వికటించి ఏడేళ్ల విద్యార్థిని జమున మృతి చెందగా, మరో 53 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనపై తెలంగాణకు చెందిన న్యాయవాది నల్లపు మణిదీప్ సుప్రీంకోర్టుకు లేఖ రాయగా, విచారణ జరపాలని సుప్రీంకోర్టు ఏపీ హైకోర్టును ఆదేశించింది.
దీంతో హైకోర్టు సుమోటో కేసు నమోదు చేసింది.
బుధవారం జరిగిన విచారణలో ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది విష్ణుతేజ స్టేటస్ రిపోర్ట్ దాఖలు చేసినట్లు తెలిపారు. తాజా వివరాలతో అఫిడవిట్ దాఖలు చేస్తామని, కొంత సమయం ఇవ్వాలని ఆయన అభ్యర్థించారు.




