జీవో 14 బీసీ ఆత్మగౌరవ భవనాలు, NewzFast Telugu: బీసీల ఆత్మగౌరవ భవనాల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం తాజాగా జారీ చేసిన జీవో 14 వివాదానికి దారితీస్తోంది. ప్రభుత్వ ఆంక్షలపై కులసంఘాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి.
గతంలో మాదిరిగానే భవనాల నిర్వహణను ట్రస్ట్‌లకు అప్పగించి, నిర్మాణాలకు నిధులు విడుదల చేయాలని సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. జీవోను తక్షణం రద్దు చేయాలని, లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలకు పిలుపునిస్తామని హెచ్చరించాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం నూతన మార్గదర్శకాలతో కులాల మధ్య చిచ్చు పెడుతోందని, ఏకతాటిపైకి వచ్చిన సంఘాలను బలహీనపరిచే ప్రయత్నం జరుగుతోందని బీసీ నేతలు ఆరోపించారు. బీసీ కులాలను కించపరచడమేనని కూడా విమర్శించారు.
పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీసీలకు అన్యాయం జరుగుతోందని సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఉదయపూర్ డిక్లరేషన్, కామారెడ్డి డిక్లరేషన్ హామీలు నెరవేరలేదని, మంత్రి పదవులు, నామినేటెడ్ పదవుల్లో బీసీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని వారు పేర్కొన్నారు.
ఈ ఆరోపణలపై బీసీ సంక్షేమ శాఖ వివరణ ఇచ్చింది. ఆత్మగౌరవ భవనాల భూములను లాక్కునే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని, జీవో 14ను పారదర్శకత, జవాబుదారీతనం కోసమే జారీ చేశామని తెలిపింది.
పెండింగ్ నిర్మాణ పనులను వేగవంతం చేస్తామని కూడా పేర్కొంది.
