గార్లఒడ్డు బస్ స్టాప్, NewzFast Telugu (ఏన్కూర్, ఖమ్మం జిల్లా): ఖమ్మం జిల్లాలోని ప్రసిద్ధ దేవాలయాల్లో గార్లఒడ్డు శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం ఒకటి. ఇక్కడ స్వామివారిని దర్శించుకునేందుకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు.
భక్తుల సౌకర్యార్థం గార్లఒడ్డు ఆధ్యాత్మిక కేంద్రంలో బస్ స్టాప్ ఏర్పాటు చేయాలని వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ ఖమ్మం ఆర్టీసీ ఆర్ఎంకు సూచించారు. గురువారం ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం ఆయన ఆర్టీసీ అధికారులతో బస్ స్టాప్ ఏర్పాటుపై చర్చించారు.
గతంలో ఇక్కడ బస్ స్టాప్ ఉండేదని, కాలక్రమంలో దానిని ఎత్తివేయడంతో ఆర్టీసీ బస్సులు ఆగడం లేదని ఎమ్మెల్యే తెలిపారు. దీనివల్ల దైవదర్శనానికి వస్తున్న భక్తులు ఇబ్బందులు పడాల్సి వస్తోందని, రవాణా సౌకర్యం కల్పించేందుకు బస్ స్టాప్‌ను వెంటనే ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.
ఈ సందర్భంగా ఆర్ఎం బస్ స్టాప్ ఏర్పాటుకు సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో గార్లఒడ్డు సొసైటీ చైర్మన్ శెట్టిపల్లి వెంకటేశ్వరరావు, ఏన్కూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లచ్చి రామ్ నాయక్, మాజీ చైర్మన్ భూక్య లాలు నాయక్, కాంగ్రెస్ నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.
ఏన్కూర్ ఎస్సై బందోబస్తు ఏర్పాటు చేశారు.




