గార్లఒడ్డు బస్ స్టాప్, NewzFast Telugu (ఏన్కూర్, ఖమ్మం జిల్లా): ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రసిద్ధ దేవాలయాల్లో గార్లఒడ్డు శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఒకటి. ఇక్కడ స్వామివారిని దర్శించుకునేందుకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు.
భక్తుల సౌకర్యార్థం గార్లఒడ్డు ఆధ్యాత్మిక కేంద్రంలో బస్ స్టాప్ ఏర్పాటు చేయాలని వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ ఖమ్మం ఆర్టీసీ ఆర్ఎంకు సూచించారు. గురువారం స్వామివారికి పూజలు నిర్వహించిన అనంతరం ఆయన ఆర్టీసీ అధికారులతో బస్ స్టాప్ ఏర్పాటుపై చర్చించారు.
గతంలో ఇక్కడ బస్ స్టాప్ ఉండేదని, కాలక్రమంలో దానిని ఎత్తివేయడంతో ఆర్టీసీ బస్సులు ఆగడం లేదని ఎమ్మెల్యే తెలిపారు. దీంతో దైవదర్శనానికి వస్తున్న భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు.
రవాణా సౌకర్యం కల్పించేందుకు గార్లఒడ్డు గ్రామంలో బస్ స్టాప్‌ను వెంటనే ఏర్పాటు చేయాలని ఆయన ఆర్ఎంను కోరారు.
ఈ అంశంపై ఆర్ఎం సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గార్లఒడ్డు సొసైటీ చైర్మన్ శెట్టిపల్లి వెంకటేశ్వరరావు, ఏన్కూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లచ్చి రామ్ నాయక్, మాజీ చైర్మన్ భూక్య లాలు నాయక్, కాంగ్రెస్ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఏన్కూరు ఎస్సై ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.




