గార్ల మండలం కోతుల దాడి, NewzFast Telugu (మహబూబాబాద్ జిల్లా, గార్ల మండలం): మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం ముల్కనూరు గ్రామానికి చెందిన రైతు గుండ్లపెల్లి వీరన్న ఎకరం మిరప తోట, ఎకరం పత్తి చేనులో కోతుల దాడితో పంట పూర్తిగా ధ్వంసమైంది.
వీరన్న పంటల కోసం వడ్డీలకు తెచ్చి సుమారు రెండున్నర లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టారు. పంట చేతికొచ్చే సమయంలో కోతులు దాడి చేసి మిరప కాయలను తెంపి పడేస్తున్నాయని, పత్తి చేనును కూడా నాశనం చేస్తున్నాయని తెలిపారు.
దీంతో పెట్టిన పెట్టుబడి కూడా చేతికి రాదేమోనని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తనలా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుని న్యాయం చేయాలని ఆయన వేడుకుంటున్నారు. కోతుల వల్ల పంటలే కాకుండా ఇళ్లలో కూడా ఉండలేని పరిస్థితి ఏర్పడిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇంట్లో వంట సామగ్రి, బియ్యం, కూరగాయలను కూడా కోతులు ఎత్తుకెళ్తున్నాయని వాపోతున్నారు.
ఇదే పరిస్థితి కొనసాగితే వ్యవసాయం చేసే పరిస్థితే ఉండదని, చివరకు రైతులు గ్రామాలు వదిలి వలస వెళ్లి నగరాల్లో పని చేసుకోవాల్సిన దుస్థితి వస్తుందని సంఘ నాయకులు అభిప్రాయపడ్డారు. సంబంధిత అధికారులు స్పందించి కోతుల బెడద లేకుండా నిర్మూలించాలని వారు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు, రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా నాయకులు గడ్డిపాటి రాజా రావు, మండల కమిటీ సభ్యులు బొబ్బ ఉపేందర్ రెడ్డి, గుండేటి వీరభద్రం, గిరిజన సంఘం నాయకులు కవి బాబు, రైతు సహదేవ్ తదితరులు పాల్గొన్నారు.




