ఉచిత న్యాయసేవల కేంద్రం, NewzFast Telugu (అమరావతి): ఆర్థిక ఇబ్బందులతో ఏ ఒక్కరికీ న్యాయసేవలు దూరం కాకూడదని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసాగిల్ పిలుపునిచ్చారు. బాధితులకు సరైన సమయంలో న్యాయసేవలు అందించేందుకు న్యాయసేవాధికార సంస్థలు కృషి చేయాలని ఆమె సూచించారు.
న్యాయసేవల ఫలాలు అందరికీ అందినప్పుడే రాజ్యాంగంలో పొందుపర్చిన సమాన న్యాయం అనే లక్ష్యం నెరవేరుతుందని ఆమె అన్నారు. హైకోర్టు న్యాయసేవల కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం హైకోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ‘ఉచిత న్యాయసేవల కేంద్రాన్ని’ సహచర న్యాయమూర్తుల సమక్షంలో చీఫ్ జస్టిస్ లిసాగిల్ ప్రారంభించారు.
పేదలకు ఉచితంగా న్యాయ సహాయం అందించే ఉద్దేశంతో న్యాయ సేవల కేంద్రం ఏర్పాటు చేయడం మంచి పరిణామమని ఆమె పేర్కొన్నారు. అర్హులైన వారందరూ ఈ కేంద్రం ద్వారా ఉచిత న్యాయ సహాయం, సలహాలు పొందవచ్చని సూచించారు.
కార్యక్రమంలో ఏపీ న్యాయసేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తిల్హరి, హైకోర్టు న్యాయసేవల కమిటీ చైర్మన్, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టుదేవానంద్, హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయసేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి హిమబిందు, హైకోర్టు న్యాయసేవల కమిటీ కార్యదర్శి మాలతి, రిజిస్ట్రార్లు, న్యాయవాదులు పాల్గొన్నారు.




