పొగమంచులో ప్రయాణం, NewzFast Telugu (సంగారెడ్డి): చలికాలంలో దట్టమైన పొగమంచు కారణంగా రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ హెచ్చరించారు.
ముఖ్యంగా తెల్లవారుజాము నుంచి ఉదయం 8 గంటల వరకు పొగమంచు తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున, అత్యవసరమైతే తప్ప ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని ఆయన సూచించారు. పొగమంచు సమయంలో ఎదురుగా వచ్చే వాహనాలు స్పష్టంగా కనిపించకపోవడంతో అతివేగం ప్రమాదాలకు దారితీస్తుందని తెలిపారు.
వాహనదారులు వేగం తగ్గించి, ముందు వెళ్లే వాహనానికి తగినంత దూరం పాటించాలని సూచించారు. హెడ్లైట్లు, ఇండికేటర్లు వినియోగించడంతో పాటు పొగమంచులో లో బీమ్ లైట్లు వాడాలన్నారు.
ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కార్లలో ప్రయాణించేవారు సీటు బెల్టు తప్పనిసరిగా ధరించాలని కోరారు. ప్రయాణంలో తొందరపాటు వద్దని, వ్యక్తిగత భద్రతతో పాటు కుటుంబ సభ్యుల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకోవాలని ఎస్పీ సూచించారు.




