మహిళా టీటీఈ సస్పెన్షన్, NewzFast Telugu (ఝాన్సీ, ఉత్తరప్రదేశ్): ప్రయాణికుడి పట్ల ఓ మహిళా ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ (టీటీఈ) అత్యంత దురుసుగా ప్రవర్తించిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో వెలుగుచూసింది. ప్రయాణికుడిని “అంగూఠాఛాప్” (నిరక్షరాస్యుడు) అంటూ అవమానించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రైల్వే శాఖ తీవ్రంగా స్పందించింది.
సదరు మహిళా టీటీఈని తక్షణమే సస్పెండ్ చేసి, ఆమెపై డిపార్ట్మెంటల్ విచారణకు ఆదేశించింది. నవంబర్ 8న వీరాంగన లక్ష్మీబాయి ఝాన్సీ రైల్వే స్టేషన్లో ఈ ఘటన చోటుచేసుకుంది.
లక్నోకు చెందిన శ్రవణ్ కుమార్, మరో ఇద్దరితో కలిసి కేఎస్ఆర్ బెంగళూరు-న్యూఢిల్లీ కర్ణాటక ఎక్స్‌ప్రెస్ (12627)లో ప్రయాణిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని పెనుకొండ నుంచి వారు స్లీపర్ క్లాస్ టికెట్లు తీసుకోగా, అవి ఆర్ఏసీకి మారాయి.
రైలు ఝాన్సీ స్టేషన్‌కు చేరుకున్నప్పుడు మహిళా టీటీఈ టికెట్లు తనిఖీ చేశారు. ఆ సమయంలో శ్రవణ్ కుమార్ తన బ్యాగులో ఉన్న టికెట్‌ను వెంటనే తీసి చూపించలేకపోయారు.
దీంతో ఇద్దరి మధ్య వాగ్వివాదం మొదలైంది.
ఆ తర్వాత టీటీఈ, శ్రవణ్ కుమార్‌ను తన ఆఫీసుకు తీసుకెళ్లారు. అక్కడ టికెట్ చూపించినప్పటికీ ఆమె శాంతించలేదని, తనను తీవ్ర పదజాలంతో దూషించారని బాధితుడు ఆరోపించారు.
ఈ సంభాషణను ఆయన వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
వైరల్ వీడియోలో “అంగూఠాఛాప్.. నీ ముఖం చూడగానే అసహ్యం వేస్తోంది.
ఇక్కడి నుంచి వెళ్లిపో. మళ్లీ స్టేషన్లో కనిపిస్తే బాగోదు” అని మహిళా టీటీఈ హెచ్చరించడం స్పష్టంగా వినిపిస్తోంది.
“ఇప్పుడు నాకు సమయం లేదు, లేదంటే నా పవరేంటో చూపించేదాన్ని” అని కూడా ఆమె అన్నట్లు వీడియోలో ఉంది.
ఈ ఘటన ప్రయాణికుల గౌరవం, రైల్వే సిబ్బంది ప్రవర్తనపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తింది. విచారణ పూర్తయిన తర్వాత అధికారిక నిర్ణయాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.




