రైతు సంక్షేమం ప్రభుత్వ లక్ష్యం, NewzFast Telugu (కోనరావుపేట, కరీంనగర్ జిల్లా): రైతుల సంక్షేమం, ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి కార్యక్రమాల అమలులో ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేయాల్సిన బాధ్యత నూతనంగా ఎన్నికైన సింగిల్ విండో పాలకవర్గాలపై ఉందని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు.
కోనరావుపేట మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు.
తరువాత సింగిల్ విండో పాలకవర్గం అభినందన సభలో మాట్లాడారు.
రాజకీయాల్లో నిరంతరం ప్రజల మధ్య ఉంటూ సేవ చేసేవారికి గుర్తింపు లభిస్తుందని, పదవులు ప్రజలకు సేవ చేసే అవకాశాలని ఆయన చెప్పారు. ఒక పదవికి పలువురు సమర్థులు పోటీలో ఉన్నప్పటికీ పరిపాలనా సౌలభ్యం కోసం ఒకరికే అవకాశం ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు.
బాధ్యతలు పొందినవారే గొప్పవారు, పొందనివారు తక్కువ అనే భావన ఎవరికీ ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా సకాలంలో నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందేలా చూడాలని సూచించారు.
పంట చేతికి వచ్చిన తర్వాత కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు లేకుండా మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు జరిగేలా చైర్మన్, సభ్యులు అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఆయన కోరారు. కోనరావుపేట ప్రాంతంలో 1500 మంది విద్యార్థులు చదువుకునేలా తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు చర్యలు చేపట్టామని కూడా తెలిపారు.
ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్లు, ఏఎంసీ చైర్మన్, కాంగ్రెస్ జిల్లా నాయకులు, సింగిల్ విండో డైరెక్టర్లు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
