నకిలీ కోర్టు ఉత్తర్వులు, NewzFast Telugu (భారత్): దేశంలో డిజిటల్ కంటెంట్ బ్లాకింగ్ వ్యవస్థలో ఉన్న తీవ్రమైన భద్రతా లోపాలు మరోసారి బయటపడ్డాయి. ఉన్నత న్యాయస్థానాల పేరిట వచ్చిన నకిలీ ఆదేశాలను గుడ్డిగా నమ్మిన కేంద్ర టెలికాం విభాగం (DoT), 129 బెట్టింగ్ వెబ్‌సైట్లను బ్లాక్ చేయడం కలకలం రేపింది.
రాజస్థాన్ మరియు అలహాబాద్ హైకోర్టులు ఈ సైట్లను నిషేధించాలని ఆదేశించినట్లు వచ్చిన పత్రాల ఆధారంగా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు (ఐఎస్‌పీ) ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే పరిశీలించగా ఆ ఉత్తర్వులన్నీ పూర్తిగా నకిలీవని తేలింది.
రాయిటర్స్ కథనం ప్రకారం, ఈ వ్యవహారంలో మోసగాళ్లు నకిలీ పత్రాలను సృష్టించారు. న్యాయస్థానాల అధికారిక లోగోలు, బ్లూ సీల్స్‌ను ఫోర్జరీ చేయడమే కాకుండా, జస్టిస్ గరిమా ప్రసాద్ వంటి న్యాయమూర్తుల సంతకాలను కూడా అక్రమంగా రూపొందించారు.
అనుమానం రాకుండా ఆర్డర్ కాపీలపై క్యూఆర్ కోడ్లను కూడా ముద్రించారు.
అయితే ఆ కోడ్లను స్కాన్ చేస్తే ఇతర సంబంధం లేని పాత కేసుల వివరాలు కనిపించడంతో అసలు బండారం బయటపడింది. న్యాయ నిపుణుల పేర్లతో ఈమెయిల్ ఐడీలను సృష్టించిన కేటుగాళ్లు, ఈ నకిలీ ఉత్తర్వులను నేరుగా కేంద్ర ప్రభుత్వ విభాగానికి పంపించారు.
ఆ పత్రాల ప్రామాణికతను కనీసం తనిఖీ చేయకుండానే టెలికాం విభాగం ఆటోమేటెడ్ పద్ధతిలో చర్యలు చేపట్టింది. వెంటనే ఆయా వెబ్‌సైట్లను నిలిపివేయాలని సర్వీస్ ప్రొవైడర్లకు ఆదేశాలు వెళ్లడంతో ఈ మోసం అమలులోకి వచ్చింది.
ఈ ఉదంతం తీవ్రరూపం దాల్చడంతో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ మరియు రాష్ట్ర పోలీసులు రంగంలోకి దిగారు.




