ఎల్‌నినో, NewzFast Telugu: పసిఫిక్ మహాసముద్రంలో మొదలైన ఎల్‌నినో సాధారణ స్థాయిని దాటి అత్యంత బలమైన దశలోకి చేరుకుంది. ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) అంచనా ప్రకారం ఇది ఇంకా తన గరిష్ఠ స్థాయికి చేరుకోలేదు. 2026 డిసెంబర్లో ప్రభావం పతాక స్థాయికి చేరుకోవచ్చని, అంటే ఈ మార్పుల ప్రభావం 2027లోనూ కొనసాగే అవకాశం ఉందని తెలిపింది.
సాధారణంగా పసిఫిక్ మహాసముద్రంలోని కొన్ని ప్రాంతాల్లో సముద్ర జలాల ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు ప్రపంచవ్యాప్తంగా గాలుల కదలికలు, వర్షపాత నమూనాలు మారిపోతాయి. ఈ ప్రభావం వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాలపై కూడా పడుతుంది.
ఎక్కడో వర్షాలు ఎక్కువ కావచ్చు, మరెక్కడో వర్షాలు తగ్గవచ్చు.
ఈసారి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న వేగం నిపుణులను ఆశ్చర్యపరుస్తోంది. NOAA ప్రమాణాల ప్రకారం ఆగస్టు నుంచి అక్టోబర్ మధ్య సముద్ర ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా నమోదయ్యాయి.
ఎల్‌నినో ఇప్పటికే ‘వెరీ స్ట్రాంగ్’ కేటగిరీలోకి చేరింది.
నవంబర్ 2026 నుంచి జనవరి 2027 మధ్య సముద్ర ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే 3.8 డిగ్రీల సెల్సియస్ వరకు పెరగవచ్చని WMO అంచనా వేస్తోంది. ఈ పెరుగుదల డిసెంబర్లో గరిష్ఠ స్థాయికి చేరవచ్చని పేర్కొంది.
WMO సెక్రటరీ జనరల్ సెలెస్టే సౌలో మాట్లాడుతూ, గత నాలుగు దశాబ్దాలుగా ఎల్‌నినోను పర్యవేక్షించడానికి ఉపయోగిస్తున్న ప్రమాణాల పరిధిని ప్రస్తుత ఉష్ణోగ్రతలు దాటిపోతున్నాయని తెలిపారు.
2026 చివర్లో ఎల్‌నినో గరిష్ఠ స్థాయికి చేరినా, దాని ప్రభావాలు త్వరగా ముగియవని ఆమె స్పష్టం చేశారు. డిసెంబర్లో ఉష్ణోగ్రతలు గరిష్ఠ స్థాయికి చేరిన తర్వాత జనవరి నుంచి పరిస్థితులు సాధారణమవుతాయని భావించడానికి లేదని హెచ్చరించారు.
శాస్త్రవేత్తలు ఎల్‌నినో తీవ్రతను కొలవడానికి రెండు ప్రమాణాలను ఉపయోగిస్తున్నారు. NOAA 2026 ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన Relative Oceanic Niño Index (RONI) పద్ధతిలో తాజా ఉష్ణోగ్రతల పెరుగుదల 2 డిగ్రీలుగా నమోదైంది.
పాత Oceanic Niño Index (ONI) పద్ధతిలో జూలై-సెప్టెంబర్ మధ్య 2.2 డిగ్రీలు, ఆగస్టు-అక్టోబర్ మధ్య 2.5 డిగ్రీలకు పెరిగినట్లు నమోదైంది.
NOAA 2027 జనవరి నుంచి మార్చి వరకు బలమైన లేదా అత్యంత బలమైన ఎల్‌నినో కొనసాగవచ్చని చెబుతోంది. నవంబర్ 2026 నుంచి జనవరి 2027 మధ్య 1950 తర్వాత నమోదైన అత్యంత బలమైన ఎల్నినోగా ఇది నిలిచే అవకాశం 70 శాతంగా అంచనా వేసింది.
ఎల్‌నినో ప్రభావం ప్రాంతాన్ని బట్టి భిన్నంగా ఉంటుంది. WMO అంచనాల ప్రకారం దక్షిణ ఆఫ్రికాలో వర్షాలు తగ్గే అవకాశం ఉంది.
ఆగ్నేయాసియాలోనూ సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మధ్య అమెరికా, అమెజాన్ ప్రాంతాల్లో కరువు ముప్పు పెరగవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వర్షాలు తగ్గితే తాగునీటి సమస్యలతో పాటు వ్యవసాయంపై తీవ్ర ప్రభావం పడుతుంది. పంట దిగుబడులు తగ్గితే ఆహార సరఫరాపై ఒత్తిడి పెరిగి ధరలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది.
మరోవైపు అధిక వర్షాలు కురిసే ప్రాంతాల్లో వరదలు, కొండచరియలు విరిగిపడటం, మౌలిక సదుపాయాలకు నష్టం వంటి సమస్యలు ఎదురుకావచ్చు.
ముందస్తు వాతావరణ హెచ్చరికలు అందుబాటులో ఉంటే ప్రభుత్వాలు సరైన ప్రణాళికలు సిద్ధం చేసుకోవచ్చని WMO సూచించింది. నీటి నిల్వలు, వ్యవసాయ ప్రణాళికలు, వరదల నుంచి రక్షణ చర్యలపై ముందుగానే దృష్టి పెట్టవచ్చని, ముఖ్యంగా ప్రకృతి విపత్తులను తట్టుకునే ఆర్థిక స్థోమత లేని పేద వర్గాలకు రక్షణ కల్పించడం అత్యంత కీలకమని ప్రొఫెసర్ సెలెస్టే సౌలో పేర్కొన్నారు.




