డీఎస్సీ–2026 నోటిఫికేషన్, NewzFast Telugu (ఆంధ్రప్రదేశ్): ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. రాష్ట్రంలోని వివిధ యాజమాన్యాల పరిధిలో 2,721 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి డీఎస్సీ–2026 సమగ్ర నోటిఫికేషన్ను పాఠశాల విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది.
అర్హులైన అభ్యర్థుల నుంచి నవంబర్ 11వ తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. మొత్తం 2,721 పోస్టుల్లో 2,111 రెగ్యులర్ స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు ఉన్నాయి.
మరో 350 పోస్టులు ప్రత్యేక విద్యా ఉపాధ్యాయులకు కేటాయించారు. వీటిలో 150 స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూల్ అసిస్టెంట్, 200 స్పెషల్ ఎడ్యుకేషన్ సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు ఉన్నాయి.
అదేవిధంగా వివిధ సొసైటీల పరిధిలో 260 ప్రిన్సిపాల్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్, ఫిజికల్ డైరెక్టర్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
అభ్యర్థుల విద్యా, వృత్తిపరమైన అర్హతలు, వయోపరిమితి, పరీక్షా విధానం, సిలబస్, పరీక్షల షెడ్యూల్, దరఖాస్తు విధానం, ఫీజు చెల్లింపు వివరాలు నోటిఫికేషన్లో పొందుపరిచారు. పోస్టుల వారీగా, జిల్లా వారీగా, సబ్జెక్టుల వారీగా ఖాళీల వివరాలను కూడా వెల్లడించారు.
డీఎస్సీ–2026 నియామక పరీక్షలను కంప్యూటర్ ఆధారిత పరీక్ష విధానంలో నిర్వహించనున్నారు. పరీక్షల తేదీలు, షెడ్యూల్ వివరాలను కూడా నోటిఫికేషన్లో ప్రకటించారు.
పూర్తి వివరాల కోసం అభ్యర్థులు పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్సైట్ https://tet2dsc.apcfss.in/ ను సందర్శించాలని డీఎస్సీ–2026 కన్వీనర్ సూచించారు.


