మాదక ద్రవ్యాలు, NewzFast Telugu (ఖమ్మం, తెలంగాణ): మాదక ద్రవ్యాల వినియోగం మనిషి ప్రాణాలకే ముప్పుగా మారుతుందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. డ్రగ్స్‌కు అలవాటు పడితే ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.
యువత, విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ చదువుపై దృష్టి సారించాలని, ఉన్నత లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని టీసీవీ రెడ్డి ఫంక్షన్ హాల్లో నషా ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యాంటీ డ్రగ్ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో సుమారు 1,200 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ఖమ్మం జిల్లాలో ఇంత మంచి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం డ్రగ్స్ రహిత తెలంగాణ సాధన కోసం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతోందని ఆయన తెలిపారు. హైదరాబాద్‌కే పరిమితం కాకుండా రాష్ట్రవ్యాప్తంగా మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలు, వాటితో సంబంధం ఉన్న నెట్‌వర్క్‌లపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిఘా, దాడులు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఇప్పటికే సుమారు 8 వేల కేసులు నమోదు చేసి, నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
మాదక ద్రవ్యాల ప్రభావం చిన్నారుల నుంచి పెద్దవారి వరకు విస్తరిస్తోందని, దీనివల్ల వ్యక్తిగత ఆరోగ్యంతో పాటు కుటుంబ వ్యవస్థ, సమాజానికి కూడా తీవ్ర నష్టం కలుగుతోందని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యను ఒక్క ప్రభుత్వ శాఖతోనో, పోలీసు శాఖతోనో నియంత్రించడం సాధ్యం కాదని అన్నారు.
ప్రభుత్వ శాఖలు, పోలీసు, ఎక్సైజ్ అధికారులు, ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజలు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
విద్యార్థుల ప్రవర్తనలో అనుమానాస్పద మార్పులు కనిపిస్తే ఉపాధ్యాయులు గుర్తించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. మాదక ద్రవ్యాల నియంత్రణలో తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు.
ఎక్కువ మంది విద్యార్థులు వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చారని, తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు పడుతూ పిల్లల భవిష్యత్తు కోసం చదివిస్తున్నారని ఆయన గుర్తుచేశారు.
విద్యార్థులు చెడు స్నేహాలు, మాదక ద్రవ్యాలు, ఇతర వ్యసనాలకు దూరంగా ఉండాలని మంత్రి సూచించారు. ఇతరుల ప్రభావంతో తమ జీవిత లక్ష్యాలను పక్కదారి పట్టించుకోవద్దని, చదువుపై దృష్టి సారించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పిలుపునిచ్చారు.
ఎక్సైజ్ శాఖ రాష్ట్ర అదనపు కమిషనర్ కిషన్ మాట్లాడుతూ, తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. జిల్లా అదనపు కలెక్టర్ శ్రీజ మాట్లాడుతూ, మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు.
ఎస్పీ సోమిరెడ్డి మాట్లాడుతూ, డ్రగ్స్ వినియోగం ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉందని, యువత అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, సుమారు 1,200 మంది విద్యార్థులు పాల్గొన్నారు.




