పంట రుణాలపై మారటోరియం, NewzFast Telugu (హైదరాబాద్): ఎల్‌నినో కారణంగా రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితుల నేపథ్యంలో రైతుల పంట రుణాల వసూళ్లపై ఏడాదిపాటు మారటోరియం విధించాలని బ్యాంకులు నిర్ణయించాయి. ప్రాథమికంగా రుణాల వసూళ్లను ఏడాదిపాటు నిలిపివేయనున్నారు.
తీవ్ర కరువు మండలాల్లో ఐదేళ్లలోపు, మధ్యస్థ కరువు మండలాల్లో మూడేళ్లలోపు తిరిగి పంట రుణాలను వసూలు చేసుకుంటాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారమే రీషెడ్యూలు, రీస్ట్రక్చరింగ్ ప్రక్రియలు ఉంటాయని బ్యాంకులు పేర్కొన్నాయి.
కరువు మండలాల్లో ప్రభావితమైన రుణ గ్రహీతలను గుర్తించనున్నారు.
మహిళా స్వయం సహాయక సంఘాల రుణాలు, ఇతర రుణాలను కూడా రీషెడ్యూల్ చేయాలని నిర్ణయించారు. మంగళవారం ప్రజాభవన్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) సమావేశంలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు.
డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, బ్యాంకుల అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం 31 జిల్లాల్లోని 365 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించింది. వీటిలో 111 మండలాలు తీవ్ర కరువు మండలాలు కాగా, 254 మండలాలు మధ్యస్థ కరువు మండలాలుగా ప్రకటించినట్లు మంత్రులు తెలిపారు.
ఈ నేపథ్యంలో ఆ మండలాల్లో ఏడాదిపాటు మారటోరియం విధించేందుకు బ్యాంకులు అంగీకరించాయి.
రుణ గ్రహీతలు రైతులు ఈ రెండు ఆప్షన్లలో దేనినైనా ఎంచుకునే వీలు కల్పించనున్నారు. కరువు మండలాలను ప్రకటించిన అక్టోబరు 24వ తేదీ నుంచి 135 రోజుల్లోగా రైతులు ఈ ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది.
రైతుల అవసరాన్ని బట్టి అదనపు పంట రుణాలను కూడా ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇందుకోసం ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేశారు.
ఈ ఆర్థిక సంవత్సరంలో బ్యాంకులు వ్యవసాయ రంగానికి లక్ష్యంగా పెట్టుకున్న రుణాల్లో 53.55 శాతం మాత్రమే అందించాయి. సెప్టెంబరు 30 వరకు రూ.96,943 కోట్ల మేర రుణాలు పంపిణీ చేశాయి.
ఈ లక్ష్య సాధన తక్కువగా ఉండటంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల అసంతృప్తి వ్యక్తం చేశారు. బ్యాంకులు రైతులకు అండగా నిలవాలని, రబీ సీజన్‌కు అవసరమైన కొత్త రుణాలను సకాలంలో అందించాలని వారు సూచించారు.




