పత్తి రైతు ఆత్మహత్య, NewzFast Telugu (వరంగల్ జిల్లా, నల్లబెల్లి): వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని బజ్జుతండాలో పంట దిగుబడి తగ్గడం, ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపానికి గురైన ఓ యువ రైతు వ్యవసాయ బావిలో పడి మృతి చెందారు. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఘటన చోటుచేసుకుంది.
బజ్జుతండాకు చెందిన జర్పుల వెంకటేష్ (28) తనకున్న రెండు ఎకరాల వ్యవసాయ భూమిలో పత్తి పంట సాగు చేశారు. అయితే సాగునీటి కొరత కారణంగా పంట దిగుబడి తగ్గడంతో ఆయన తీవ్ర ఆవేదనకు గురయ్యారు.
పంట చేతికి రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తోటి రైతుల వద్ద వాపోయేవారని స్థానికులు తెలిపారు.
ఈ క్రమంలో ఇటీవల ఆయన భార్య కూడా పుట్టింటికి వెళ్లిపోవడంతో వెంకటేష్ మరింత మనస్తాపానికి గురైనట్లు బంధువులు చెబుతున్నారు. గురువారం సాయంత్రం సమీపంలోని వ్యవసాయ బావిలో పడి ఆయన మృతి చెందారు.
ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యల కారణంగా ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని అనుమానిస్తున్నారు.
ఈ ఘటనపై నల్లబెల్లి పోలీసులకు ఫిర్యాదు అందగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సాయి ప్రసన్న కుమార్ తెలిపారు.




