సైన్యాన్ని గౌరవించడంలో కాంగ్రెస్ విఫలం, NewzFast Telugu (హైదరాబాద్): బస్తర్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రసంగంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు తీవ్రస్థాయిలో స్పందించారు. ఆయన నగరంలో జాతీయ మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ మరియు రాహుల్ గాంధీ దేశ సాయుధ దళాలు, పారామిలిటరీ బలగాలు, సైన్యాన్ని గౌరవించడంలో వరుసగా విఫలమవుతూనే ఉన్నారని విమర్శించారు.
బస్తర్ ప్రాంతంలో సీఆర్‌పీఎఫ్ (CRPF) జవాన్ల హత్యలను కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ ఖండించలేదని రామచందర్ రావు ఆరోపించారు. దానికి భిన్నంగా ప్రధాని మోడీ బస్తర్‌లో పారామిలిటరీ మరియు సాయుధ బలగాల జవాన్లతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకుని వారి మనోధైర్యాన్ని పెంచారని ఆయన కొనియాడారు.
బస్తర్‌లో నక్సలైట్ల హింసను గానీ, పుల్వామా దాడిలో జవాన్ల అమరత్వాన్ని గానీ, ఉగ్రవాద చర్యలను గానీ ఖండించే ధైర్యం రాహుల్ గాంధీకి లేదని, బాధితులకు కనీస సానుభూతి కూడా ప్రకటించలేదని ఆయన ధ్వజమెత్తారు. రష్యా, వియత్నాం, అమెరికా విదేశీ పర్యటనలపై దృష్టి పెట్టకుండా పార్లమెంట్ సమావేశాలకు హాజరై చర్చల్లో బాధ్యతాయుతంగా పాల్గొనాలని రాహుల్ గాంధీకి రామచందర్ రావు హితవు పలికారు.




