క్లీన్ ఎనర్జీ ఆంధ్రప్రదేశ్, NewzFast Telugu (విశాఖపట్నం): క్లీన్ ఎనర్జీ రంగంలో ఆంధ్రప్రదేశ్‌ను సౌదీ అరేబియాలా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. విశాఖపట్నంలో జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో భాగంగా ‘భారతదేశ ఇంధన భవిష్యత్తుకు ఊతమివ్వడం: పునరుత్పాదక ఇంధన వనరులు, గ్రీన్ హైడ్రోజన్’ అంశంపై నిర్వహించిన ప్రత్యేక ప్లీనరీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మారుతున్న అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిస్థితుల దృష్ట్యా దేశం ఇంధన రంగంలో స్వయం సమృద్ధి సాధించాల్సిన అవసరం ఎంతో ఉందని పేర్కొన్నారు. సౌర, పవన, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలో భారీగా స్వచ్ఛమైన విద్యుత్‌ను ఉత్పత్తి చేయడమే కాకుండా, దానిని గ్రీన్ మాలిక్యూల్స్‌గా మార్చి అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేసే సత్తా ఏపీకి ఉందని లోకేశ్ వివరించారు.
సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఇంధన స్వయం సమృద్ధిపై స్పష్టమైన విధానంతో ఉన్నారని గుర్తుచేశారు. రాయలసీమలో పుష్కలమైన సూర్యరశ్మి, ఇతర ప్రాంతాల్లో పవన విద్యుత్, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల ఏర్పాటుకు అత్యంత అనుకూలమైన వాతావరణం ఉందని తెలిపారు.
గత ఏడాది కాలంలోనే రాష్ట్రంలో విద్యుత్ వినియోగం దాదాపు 30 శాతం పెరిగిందని, కొత్తగా వస్తున్న పరిశ్రమలు, డేటా సెంటర్ల కారణంగా 2028 నాటికి విద్యుత్ డిమాండ్ రెట్టింపు అయ్యే అవకాశముందని మంత్రి విశ్లేషించారు. ఈ పెరిగే డిమాండ్‌ను తట్టుకోవడానికి పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయడంపై దృష్టి సారించినట్లు చెప్పారు.
సంప్రదాయ జలవిద్యుత్ ప్రాజెక్టుల మాదిరిగా ఏళ్ల తరబడి సమయం తీసుకోకుండా ఈ ప్రాజెక్టులను త్వరితగతిన అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోందని వివరించారు.




