చైనా మహిళలు హోటల్ గదులు బుక్ చేసుకోవడం, NewzFast Telugu: చైనాలో ఉద్యోగం చేసే మహిళలు ఇంటి బాధ్యతల విషయంలో తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక వెల్లడించింది. ఉద్యోగం చేసే తల్లుల్లో మూడింట ఒక వంతు మంది ఇంటి పనుల కోసం అదనంగా రెండు గంటలు కేటాయిస్తున్నారు.
ఉద్యోగం చేసే తండ్రులతో పోలిస్తే తల్లులపైనే ఇంటి పనుల భారం ఎక్కువగా ఉంది. ఈ పరిస్థితుల్లో కొందరు మహిళలు హోటల్ గదులు బుక్ చేసుకుని కొన్ని గంటలు ఒంటరిగా గడుపుతున్నారు.
సోషల్ మీడియాలో 'హోటల్ గెట్‌అవే డైరీలు' పేరుతో ఈ మహిళలు తమ అనుభవాలను పోస్ట్ చేస్తున్నారు. కొందరు ప్రశాంతంగా నిద్రపోతుండగా, మరికొందరు పుస్తకాలు చదువుతూ తమకు నచ్చిన పనులు చేసుకుంటున్నారు.
రోజువారీ ఒత్తిడి నుంచి బయటపడేందుకు ఇది తమకు లభించిన అరుదైన అవకాశమని వారు చెబుతున్నారు.
ఒక మహిళ తన పోస్ట్‌లో కుటుంబ సభ్యులు సహాయం చేసేందుకు ముందుకు వచ్చినా పిల్లలు ప్రతిసారీ అమ్మనే పిలుస్తారని రాసుకొచ్చారు. ఇంటికి వెళ్లిన తర్వాత చేయాల్సిన పనుల జాబితా ఎప్పటికీ పూర్తికాదని ఆమె పేర్కొన్నారు.
జియాంగ్సు ప్రావిన్స్ చాంగ్‌జౌ నగరానికి చెందిన గాంగ్ యాన్ అనే మహిళ తన పొదుపు మొత్తంతో 25 చదరపు మీటర్ల చిన్న ఫ్లాట్‌ను 5 లక్షల యువాన్లకు (సుమారు రూ.57 లక్షలు) కొనుగోలు చేసింది. ఇంటి బాధ్యతల మధ్య తనకంటూ ప్రత్యేక స్థలం ఉండాలనే ఆలోచనతోనే ఆమె ఈ నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతం వారంలో ఒకటి లేదా రెండు రోజులు ఆ ఫ్లాట్‌లో ఒంటరిగా గడుపుతున్న గాంగ్, యోగా, చదువు, స్నేహితులతో కబుర్లు వంటివి చేస్తున్నట్లు తెలిపింది. ఆమె నిర్ణయానికి కుటుంబ సభ్యులు మద్దతు తెలిపారని నివేదిక పేర్కొంది.
చైనాలో కుటుంబ బాధ్యతల ఒత్తిడి పెళ్లిళ్లు, పిల్లలను కనే నిర్ణయాలపై ప్రభావం చూపుతున్నట్లు నివేదికలో ప్రస్తావించారు. 2021లో చైనాలో 1.062 కోట్ల మంది పిల్లలు జన్మించారని, ఇది 2020తో పోలిస్తే 11.5 శాతం తక్కువని పేర్కొన్నారు. మహిళలకు వ్యక్తిగత జీవితం, ప్రశాంతత అవసరమని మానసిక వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారని కథనం తెలిపింది.

