చంద్రబాబుపై కేసులు సీబీఐ దర్యాప్తు పిటిషన్, NewzFast Telugu (అమరావతి): సీఎం చంద్రబాబు, తదితరులపై నమోదైన కేసుల దర్యాప్తును సీబీఐ, ఈడీకి అప్పగించాలని కోరుతూ దాఖలైన పిల్‌పై ఇరువైపుల వాదనలు ముగియడంతో తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది.
ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసాగిల్, జస్టిస్ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు ఇచ్చింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ అధినేత చంద్రబాబు, తదితరులపై ఇన్నర్ రింగ్ రోడ్డు, స్కిల్, ఫైబర్ గ్రిడ్, రాజధాని అసైన్డ్ భూములు, మద్యం, ఉచిత ఇసుక పాలసీల విషయంలో సీఐడీ నమోదు చేసిన పలు కేసుల దర్యాప్తును సీబీఐ, ఈడీకి అప్పగించేలా ఆదేశించాలని కోరుతూ పాత్రికేయుడు బాలగంగాధర తిలక్ 2024లో హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.
దర్యాప్తులో భాగంగా స్వాధీనం చేసుకొని సీజ్ చేసిన డాక్యుమెంట్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను సంబంధిత వ్యక్తులకు తిరిగి ఇవ్వకుండా విజయవాడ ఏసీబీ కోర్టును ఆదేశించాలని కోరుతూ అనుబంధ పిటిషన్ కూడా దాఖలైంది. మరోవైపు స్కిల్ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ మరో పిల్ వేశారు.
ఈ పిటిషన్లపై ఇటీవల ధర్మాసనం తుది విచారణ జరిపింది. కేసుల సమాచారాన్ని పట్టిక రూపంలో తమ ముందు ఉంచాలని సీఐడీ తరఫు న్యాయవాదిని ఆదేశిస్తూ గతంలో విచారణను వాయిదా వేసింది.
మంగళవారం విచారణలో సీఐడీ తరఫు న్యాయవాది అనురాగ్ అహ్లువాలియా కోర్టు ఆదేశాల మేరకు కేసుల వివరాలన్నింటినీ పట్టిక రూపంలో సమర్పించినట్లు తెలిపారు.
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఫిర్యాదుదారుడిగా ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి తప్ప ఇతరులు ఎవరూ ప్రొటెస్ట్ పిటిషన్ దాఖలు చేయలేదని ఆయన పేర్కొన్నారు. ఈ కేసులతో సంబంధం లేని థర్డ్ పార్టీ వ్యక్తులు ఏసీబీ కోర్టులో సీఐడీ దాఖలు చేసిన ఫైనల్ రిపోర్ట్, కేసుల మూసివేత ఉత్తర్వుల ప్రతులను ఇప్పించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్లు వేశారని చెప్పారు.
పిటిషనర్ తరఫున న్యాయవాది సుమన్ వాదనలు వినిపిస్తూ, కేసుల ఉపసంహరణకు ఎన్వోసీలు ఇచ్చిన వారిలో నలుగురు ప్రభుత్వాధికారులేనని పేర్కొన్నారు. వాదనలు ముగియడంతో ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.




