CBSE 2027 board exam schedule, NewzFast Telugu: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 2027 విద్యా సంవత్సరానికి సంబంధించి 10, 12వ తరగతి బోర్డు పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. శుక్రవారం ప్రకటించిన ఈ షెడ్యూల్ ప్రకారం పరీక్షలు 2027 ఫిబ్రవరి 16 నుంచి మార్చి 9 వరకు కొనసాగనున్నాయి.
పరీక్షలు ప్రారంభం కావడానికి 101 రోజుల ముందే టైమ్‌టేబుల్‌ను విడుదల చేసినట్లు బోర్డు వెల్లడించింది. విద్యార్థులు ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని తెలిపింది.
ఈసారి 10వ తరగతి విద్యార్థులు మొత్తం 83 సబ్జెక్టులకు, 12వ తరగతి విద్యార్థులు 121 సబ్జెక్టులకు పరీక్షలు రాయనున్నారు. విద్యార్థుల సన్నద్ధతకు ఇబ్బందులు కలగకుండా షెడ్యూల్‌ను రూపొందించినట్లు సీబీఎస్ఈ తెలిపింది.
12వ తరగతి విద్యార్థుల కోసం నిర్వహించే ప్రధాన ప్రవేశ పరీక్షల తాత్కాలిక షెడ్యూళ్లను కూడా పరిగణనలోకి తీసుకుని తేదీలను ఖరారు చేసినట్లు బోర్డు పేర్కొంది. ప్రవేశ పరీక్షలకు ముందే బోర్డు పరీక్షలు పూర్తయ్యేలా ప్రయత్నించినట్లు వెల్లడించింది.
సీబీఎస్ఈ వివరాల ప్రకారం 10వ తరగతి పరీక్షల కోసం 26.5 లక్షలకు పైగా విద్యార్థులు నమోదు చేసుకున్నారు. 12వ తరగతి పరీక్షలకు 19.18 లక్షలకు పైగా విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్నారు.

