ఎడ్లబండి బావిలో పడి ఎద్దు మృతి, NewzFast Telugu (అలంపూర్, మానవపాడు): ఆరుగాలం కష్టించి పంట పండించే ఓ రైతుకు ఊహించని కష్టం ఎదురైంది. సాగునీరు లేక ఇప్పటికే పంట ఎండిపోయి ఆందోళనలో ఉన్న ఆయనకు, జీవనాధారమైన ఎద్దు మృతి చెందడంతో తీరని విషాదం మిగిలింది.
మానవపాడు మండల పరిధిలోని పల్లెపాడు గ్రామానికి చెందిన రైతు సుందర్రావు ఎప్పటిలాగే తన ఎడ్లబండిపై మిరప చేనుకు ఎరువులు తీసుకెళ్తున్నారు. పొలం పక్కన ఎద్దుల బండి నిలుచుంది.
ఆ క్రమంలో ఎదురుగా వేగంగా వచ్చిన ఓ ద్విచక్రవాహనం శబ్దానికి ఎద్దులు ఒక్కసారిగా బెదిరాయి.
బండితో సహా అదుపుతప్పి పక్కనే ఉన్న వ్యవసాయ బావిలో పడిపోయాయి. స్థానికులు గమనించి బయటకు తీసేలోపే ఒక ఎద్దు నీటమునిగి మృతి చెందింది.
మరో ఎద్దుకు తీవ్ర గాయాలు కాగా, ఎడ్లబండి పూర్తిగా దెబ్బతింది.
అప్పు చేసి మరీ ఎద్దులను కొనుగోలు చేశానని, ఓవైపు నీరందక మిర్చి పంటలు ఎండిపోతుంటే, మరోవైపు చేతికందొచ్చిన ఎద్దు చనిపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డానని రైతు సుందర్రావు కన్నీరుమున్నీరయ్యారు. ప్రభుత్వం స్పందించి తనకు తగిన నష్టపరిహారం అందించి ఆదుకోవాలని ఆయన వేడుకుంటున్నారు.




