రైతు గర్జన సభ, NewzFast Telugu (నిర్మల్): కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో అన్ని రంగాల్లో విఫలమైందని బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు విమర్శించారు. రైతాంగాన్ని నిలువునా ముంచిందని వారు ధ్వజమెత్తారు.
నిర్మల్ జిల్లా కేంద్రంలో బుధవారం రైతుల పక్షాన తలపెట్టిన రైతు గర్జన సభకు జిల్లా నుంచి బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతున్న ఈ సభకు ప్రత్యేక వాహనాల్లో ఉత్సాహంగా బయల్దేరారు.
కేసీఆర్ పాలనలో బీడు భూములు పంటలతో కలకలలాడాయని, రైతులు సంతోషంగా రెండు పంటలు పండించుకున్నారని నాయకులు పేర్కొన్నారు. ఈ రైతు గర్జన సభతో కాంగ్రెస్ ప్రభుత్వం దిగివచ్చి రైతు భరోసా నిధులు విడుదల చేస్తుందని విమర్శించారు.
మంచిర్యాల, చెన్నూర్, జన్నారం, భీమారం, కోటపల్లి, దండేపల్లి తదితర మండలాల నుంచి కూడా పార్టీ నాయకులు, కార్యకర్తలు సభకు తరలివెళ్లారు. ఖానాపూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి భూక్యా జాన్సన్ నాయక్ ఆదేశాల మేరకు జన్నారం మండలం నుంచి 29 గ్రామాల నుంచి శ్రేణులు తరలివెళ్లాయి.
దండేపల్లి మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన తీగల చంద్రయ్య తన సొంత ఖర్చులతో ఆటోలో సభకు హాజరవుతున్నట్లు తెలిపారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తున్నానని ఆయన పేర్కొన్నారు.




