భూ రీసర్వే, NewzFast Telugu (హైదరాబాద్): భూ యజమానులకు స్పష్టమైన హక్కులు, కచ్చితమైన సరిహద్దులు కల్పించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం చేపట్టిన సమగ్ర భూ రీసర్వేను పారదర్శకంగా, శాస్త్రీయంగా, పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. భూ యజమానుల ప్రయోజనాలు, అభిప్రాయాలు, మనోభావాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా భూ సర్వే పురోగతిపై మంగళవారం సచివాలయంలో రెవెన్యూ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయి సమస్యలు, రైతుల స్పందన, సాంకేతిక అంశాలు, సిబ్బందికి ఎదురవుతున్న పరిస్థితులపై చర్చించారు.
సర్వే సిబ్బందితో ఫోన్లో మాట్లాడి పరిస్థితులను తెలుసుకున్నారు.
రాష్ట్రంలో 10,954 రెవెన్యూ గ్రామాలు ఉండగా, తొలి దశలో హైదరాబాద్ మినహా మిగిలిన 32 జిల్లాల్లో జిల్లాకు 70 గ్రామాల చొప్పున ఎంపిక చేశారు. నక్షాలు లేని గ్రామాలను కలుపుకొని మొత్తం 2,720 గ్రామాల్లో రీసర్వే నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
ఇప్పటివరకు 1,000 గ్రామాల్లో రీసర్వే మైలురాయిని దాటగా, 416 గ్రామాల్లో ప్రక్రియ పూర్తయిందని వెల్లడించారు.
గ్రామాల్లో సర్వేకు ముందు సంబంధిత రెవెన్యూ రికార్డులను పూర్తిస్థాయిలో పరిశీలించాలని మంత్రి సూచించారు. వివరాలు, భూముల విస్తీర్ణం, హక్కులు, సరిహద్దులను పరిశీలించిన తర్వాతే క్షేత్రస్థాయి సర్వే ప్రారంభించాలన్నారు.
సర్వే అనంతరం భూ యజమానులకు నోటీసులు జారీ చేసి, వివరాలు పరిశీలించుకునేందుకు, అభ్యంతరాలు లేదా అభిప్రాయాలు తెలిపేందుకు అవకాశం కల్పించాలని ఆదేశించారు. అభ్యంతరాలను నిబంధనల ప్రకారం పరిష్కరించాలన్నారు.
సర్వే విధానం, నోటీసులు, అభ్యంతరాల నమోదుపై గ్రామస్థాయిలో రైతులకు, భూ యజమానులకు అవగాహన కల్పించాలని సూచించారు. సర్వే ప్రక్రియపై ఎలాంటి అపోహలు, అనుమానాలు లేకుండా పారదర్శకంగా వ్యవహరించాలని తెలిపారు.
చిన్న పొరపాట్లను వెంటనే సరిదిద్ది, భవిష్యత్తులో భూ వివాదాలు తలెత్తకుండా కచ్చితత్వానికి ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు.
రీసర్వే పూర్తయిన గ్రామాల్లో భూదార్ నంబర్ల కేటాయింపును వేగవంతం చేసి, భూముల వివరాలు, హక్కులు, సరిహద్దులపై స్పష్టమైన రికార్డులు అందుబాటులోకి తేవాలని మంత్రి ఆదేశించారు. పురోగతి, సమస్యలు, జాగ్రత్తలు, భూ యజమానులకు కల్పించాల్సిన అవకాశాలపై బుధవారం జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు, సర్వే శాఖ అసిస్టెంట్ డైరెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.
జిల్లా వారీగా పురోగతిని సమీక్షించి తదుపరి కార్యాచరణపై ఆదేశాలు ఇవ్వనున్నారు.
ఈ సమీక్షలో రెవెన్యూ శాఖ కార్యదర్శి డి.ఎస్. లోకేష్ కుమార్, సర్వే అండ్ ల్యాండ్ సెటిల్మెంట్ కమిషనర్ రాజీవ్ గాంధీ హనుమంతు, జాయింట్ డైరెక్టర్ ప్రసన్నలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.




