భూ భారతి ఆపరేటర్ల వేతనాలు, NewzFast Telugu (హైదరాబాద్): ఏడు నెలలుగా పెండింగ్‌లో ఉన్న భూ భారతి ఆపరేటర్ల వేతనాలను వెంటనే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (టీజీఎస్ హెచ్ఆర్‌సీ) చైర్‌పర్సన్ జస్టిస్ షమీమ్ సిఫారసు చేశారు.
కామారెడ్డి జిల్లా కొండాపూర్‌కు చెందిన పి.లింగం దాఖలు చేసిన ఫిర్యాదును విచారించిన కమిషన్, దీర్ఘకాలంగా వేతనాలు నిలిపివేయడంతో ఆపరేటర్ల జీవనోపాధికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొంది. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కల్పించిన గౌరవప్రదమైన జీవించే హక్కుకు విఘాతం కలిగిస్తుందని అభిప్రాయపడింది.
ఇదే సమయంలో, 2025 అక్టోబరు 31న తనను అక్రమంగా నిర్బంధించి భౌతిక దాడి చేశారంటూ గోల్కొండ ఎస్‌ఐపై షేక్ సాజిద్ అహ్మద్ చేసిన ఫిర్యాదును కూడా కమిషన్ విచారించింది. ఆయన వైద్య రికార్డుల్లో గాయాలు నమోదైనట్లు పరిగణనలోకి తీసుకుంది.
పోలీసు అధికారిపై ఆరోపణలు చేసిన వ్యక్తిపై ప్రతిగా క్రిమినల్ కేసు నమోదు చేశారని తెలుసుకున్న కమిషన్, దీనిపై విచారించి తీసుకునే చర్యలేమిటో ఆరు నెలల్లోగా తెలపాలని హైదరాబాద్ పోలీసు కమిషనర్‌ను ఆదేశించింది. ఆరోపణలపై నిష్పాక్షిక విచారణ జరగాలని కూడా స్పష్టం చేసింది.




