భారత్ విస్తార్, NewzFast Telugu (హైదరాబాద్): రైతులకు కృత్రిమ మేధ ఆధారిత సేవలను తెలుగులోనే అందుబాటులోకి తీసుకురావడానికి తెలంగాణ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఏఐ ఆధారిత జాతీయ వ్యవసాయ డిజిటల్ వేదిక ‘భారత్ విస్తార్’తో రాష్ట్రాన్ని అనుసంధానించేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్మార్ట్ గవర్నమెంట్ (ఎన్‌ఐఎస్‌జీ) మధ్య గురువారం సచివాలయంలో ఒప్పందం జరిగింది.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. సాధారణంగా రైతులు పంటల సాగు, వాతావరణం, ఎరువుల వినియోగం, చీడపీడల నివారణ, మార్కెట్ ధరలు, ప్రభుత్వ పథకాల సమాచారం కోసం వివిధ కార్యాలయాలు, వెబ్‌సైట్లు, యాప్‌లపై ఆధారపడాల్సి వస్తోంది.
ఈ సమస్యకు పరిష్కారంగా భారత్ విస్తార్ ఒకే డిజిటల్ వేదిక ద్వారా అవసరమైన సమాచారాన్ని అందిస్తుంది.
ఈ వేదికలో పొందుపరిచిన ‘భారతి’ అనే కృత్రిమ మేధ ఆధారిత వాయిస్ అసిస్టెంట్ రైతులతో సంభాషిస్తూ వారి ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంది. రైతులు తమ సమస్యలను మాతృభాషలో మాట్లాడి లేదా టైప్ చేసి అడగవచ్చు.
ప్రశ్నను విశ్లేషించి, అందుబాటులో ఉన్న శాస్త్రీయ సమాచారం, ప్రభుత్వ డేటా ఆధారంగా సూచనలు అందించడం దీని ప్రత్యేకత.
భారత్ విస్తార్‌లో ఆరు కీలక సేవలు అందుబాటులో ఉంటాయి. మొదటి దశలో ఇప్పటికే సిద్ధంగా ఉన్న జాతీయ చాట్‌బాట్, వాయిస్ బాట్ సేవలను తెలుగులో అందుబాటులోకి తీసుకురానున్నారు.
ప్రత్యేక రాష్ట్రస్థాయి పోర్టల్, తెలుగు యాప్‌ను 15 నుంచి 21 రోజుల్లో అందుబాటులోకి తెచ్చేలా లక్ష్యం పెట్టుకున్నారు.
వాట్సాప్ చాట్‌బాట్ ద్వారా రైతులు తమ సందేహాలను పంపి సమాధానాలు పొందే సదుపాయాన్ని 45 నుంచి 60 రోజుల్లో ప్రారంభించేందుకు ప్రణాళిక రూపొందించారు. వచ్చే 6 నెలల నుంచి ఏడాది కాలంలో రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, వ్యవసాయ శాఖ సర్క్యులర్లను దశలవారీగా ఈ వేదికలో చేర్చనున్నారు.
భారత్ విస్తార్ వేదికను రాష్ట్ర రైతులకు మరింత ప్రయోజనకరంగా తీర్చిదిద్దాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు.




