భారత్ సమిట్ 2026, NewzFast Telugu (హైదరాబాద్): ప్రపంచ రాజకీయాలు, ఆర్థిక అసమానతలు, వాతావరణ మార్పులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వంటి అంతర్జాతీయ అంశాలపై చర్చించేందుకు హైదరాబాద్ వేదికైంది. ప్రతిష్ఠాత్మక ‘భారత్ సమిట్–2026’ నిర్వహణకు నగరం సర్వాంగసుందరంగా ముస్తాబైంది.
నేటి నుంచి మూడు రోజుల పాటు జరగనున్న ఈ అంతర్జాతీయ సదస్సుకు సుమారు 70 దేశాల నుంచి 1,000 మందికి పైగా ప్రతినిధులు హాజరుకానున్నారు. హైదరాబాద్‌లోని హైటెక్స్ (HITEX) వేదికగా ఈ సదస్సు జరగనుంది.
ఇందులో వివిధ దేశాలకు చెందిన రాజకీయ, పారిశ్రామిక, విద్యారంగ ప్రముఖులు పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు.
జాతీయ స్థాయిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ సహా పలువురు కీలక నాయకులు ఈ సదస్సులో పాల్గొంటున్నారు. ప్రజాస్వామ్యానికి ఎదురవుతున్న సవాళ్లు, మారుతున్న ప్రపంచ రాజకీయ సమీకరణాలు, కృత్రిమ మేథ ప్రభావం వంటి అంశాలపై 12 ప్రత్యేక అంతర్జాతీయ సెషన్లను నిర్వహిస్తున్నారు.
‘అవర్ వరల్డ్ ఇన్‌స్టిట్యూట్’ (Our World Institute) ఆధ్వర్యంలో ప్రపంచంలోని ప్రగతిశీల రాజకీయ, సామాజిక శక్తులను ఒకే వేదికపైకి తీసుకురావడం, అంతర్జాతీయ సమస్యలకు ఉమ్మడి పరిష్కారాలను రూపొందించడమే ఈ సదస్సు ప్రధాన లక్ష్యమని కాంగ్రెస్ నేతలు వెల్లడించారు. ఇందుకోసం హైటెక్స్ పరిసరాల్లో నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేశారు.




