భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భారీ వర్షాలు, NewzFast Telugu (ములకలపల్లి): మురసు తుఫాన్ ప్రభావంతో ములకలపల్లి మండలవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.
ప్రధాన రహదారులు జలమయమవ్వగా, లోతట్టు ప్రాంతాల్లోని పంట పొలాలు నీట మునిగాయి. పాల్వంచ నుంచి మాదారం మీదుగా అన్నపురెడ్డిపల్లి వెళ్లే రహదారిపై సత్యంపేట గ్రామం వద్ద పాములేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది.
వంతెనపై నుంచి వరద నీరు పొంగిపొర్లుతుండటంతో ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు పాల్వంచ నుంచి దమ్మపేట వెళ్లే రహదారిపై రాజుపేట శివారులో ఇటీవల కూలిన వంతెన పక్కన ఏర్పాటు చేసిన తాత్కాలిక అప్రోచ్ కూడా వరద ఉధృతికి కొట్టుకుపోయింది.
దీంతో ఈ రెండు మార్గాల్లో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
భారీ వర్షాలతో మండలంలోని లోతట్టు ప్రాంతాల్లో సాగు చేస్తున్న వరి, మిర్చి, పుచ్చ, శనగ తదితర పంటలు నీట మునుగుతున్నాయి. ఇప్పటికే వర్షాలతో ఇబ్బందులు పడుతున్న రైతులకు తాజా వర్షాలు మరింత నష్టం కలిగించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వర్షాలు ఇలాగే కొనసాగితే పంటలు పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉందని రైతులు ఆవేదన చెందుతున్నారు.

