భద్రాద్రి కొత్తగూడెం మంత్రాల అనుమానం హత్యలు, NewzFast Telugu (భద్రాద్రి కొత్తగూడెం జిల్లా): సమాజం అభివృద్ధి చెందుతున్నప్పటికీ, మారుమూల ప్రాంతాల్లో ఇంకా మూఢనమ్మకాలు కొనసాగుతున్నాయి. దీనికి నిదర్శనంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం బుడుగుల గూత్తికోయ గ్రామంలో జరిగిన అమానుష ఘటన నిలిచింది.
మంత్రాలు చేస్తున్నారనే అనుమానంతో ఇద్దరు వృద్ధులను హత్య చేయగా, భయంతో వారి కుటుంబానికి చెందిన మరో ఇద్దరు దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ వరుస మరణాలతో జిల్లాలో తీవ్ర కలకలం రేగింది.
మణుగూరు మండలం బుడుగుల గ్రామానికి చెందిన పద్దం మాసయ్య, ఆళ్లపల్లి మండలం భూసురాయి గ్రామానికి చెందిన భీమయ్య బంధువులు. నెల రోజుల క్రితం మాసయ్య మనమరాలికి ఆరోగ్యం క్షీణించడంతో భీమయ్య వచ్చి పూజలు చేశాడు.
అయితే, గత కొంతకాలంగా భీమయ్య, మాసయ్యలు మంత్రాలు చేస్తూ స్థానికులను ఇబ్బంది పెడుతున్నారని, వారి పూజల వల్లే గ్రామంలో అనేకమంది మృత్యువాత పడుతున్నారని కొందరు కక్ష పెంచుకున్నారు. నెల రోజుల క్రితం దుండగులు కర్రలతో కొట్టి ఇద్దరినీ హత్య చేసి, అడవిలోని ఓ చెక్‌డ్యామ్ దగ్గర పాతిపెట్టారు.
మృతుడు భీమయ్య కూతురు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ హత్యల్లో ఐదుగురు వ్యక్తులు పాల్గొన్నట్లు మణుగూరు సీఐ నాగబాబు తెలిపారు.
నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
ఇదే గ్రామంలో మరో విషాదం చోటుచేసుకుంది. హత్యకు గురైన మాసయ్య కుమారుడు రాంబాబు (30), అతని భార్య సునీత (25) తమ తండ్రిని చంపినవారే తమను కూడా చంపుతారనే భయంతో బలవన్మరణానికి పాల్పడ్డారు.
నిన్న రాత్రి ఇద్దరూ కలిసి ఇప్పసారాయిలో పురుగుల మందు కలుపుకుని తాగి అపస్మారక స్థితికి చేరుకున్నారు.
స్థానికులు వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో సునీత ప్రాణాలు కోల్పోయింది. రాంబాబు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మూఢనమ్మకాల కారణంగా ఇద్దరు హత్యకు గురికాగా, ప్రాణభయంతో మరో ఇద్దరు దంపతులు ఆత్మహత్య చేసుకోవడంతో ఆ గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.




