బేతుపల్లి చెరువు సహాయక చర్యలు, NewzFast Telugu (ఖమ్మం జిల్లా): బేతుపల్లి చెరువులో గల్లంతైన ఆరుగురు మత్స్యకారులను రక్షించేందుకు చేపట్టిన సహాయక చర్యల్లో ప్రమాదంలో చిక్కుకున్న ఆరుగురు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, నలుగురు అగ్నిమాపక సిబ్బందిని ఎన్డీఆర్ఎఫ్ బృందం సురక్షితంగా రక్షించింది.
రాత్రంతా బేతుపల్లి చెరువు వద్దే ఉండి సహాయక చర్యలను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూ బాధితుల ప్రాణాలను కాపాడేందుకు నిరంతరం కృషి చేసిన సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ అంకితభావం పట్ల స్థానిక ప్రజలు, మత్స్యకారులు, వారి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఆమెకు, రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
సహాయక చర్యలు వేగవంతంగా కొనసాగేందుకు ఖమ్మం జిల్లా కలెక్టర్ ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి పరిస్థితిని నివేదిస్తూ అవసరమైన యంత్రాంగాన్ని, సహాయక వనరులను సమకూర్చారు. ఈ సందర్భంగా కలెక్టర్కు స్థానికులు, మత్స్యకారుల కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ ఘటనపై ప్రత్యేక చొరవ చూపుతూ సహాయక చర్యలకు అవసరమైన ఏర్పాట్లు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రులు పొంగులేటి, తుమ్మలకు కూడా ఎమ్మెల్యే, సహాయక సిబ్బంది, మత్స్యకారుల కుటుంబ సభ్యుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
