బెంగళూరు భార్య భర్త హత్య, NewzFast Telugu (బెంగళూరు, కర్ణాటక): పిల్లలు పుట్టలేదనే కారణంతో భర్త పెడుతున్న వేధింపులు తాళలేక ఓ భార్య దారుణానికి పాల్పడింది. కర్ణాటక రాజధాని బెంగళూరులోని కెంపేగౌడనగర లక్ష్మీపురలో కత్తితో భర్తపై దాడి చేసి హతమార్చిన ఘటన చోటుచేసుకుంది.
పోలీసుల వివరాల ప్రకారం, రాజశేఖర్ (43), మాలశ్రీ (35) భార్యాభర్తలు. వివాహమై చాలా ఏళ్లు గడిచినా వారికి పిల్లలు కలగలేదు.
ఈ విషయాన్ని కారణంగా చూపుతూ రాజశేఖర్ తరచూ మద్యం తాగి భార్యతో గొడవపడేవాడని, ఆమెను అవమానిస్తూ వేధింపులకు గురిచేసేవాడని తెలిసింది.
ఈ క్రమంలో బుధవారం రాత్రి కూడా ఇద్దరి మధ్య మరోసారి గొడవ జరిగింది. తీవ్ర ఆగ్రహానికి గురైన మాలశ్రీ వంటింట్లోని కత్తి తీసుకొచ్చి భర్తపై దాడి చేసింది.
ఛాతీ భాగంలో కత్తితో పొడవడంతో రాజశేఖర్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. మాలశ్రీని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.
ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.




