బీసీ గురుకులాల క్రీడా పోటీలు, NewzFast Telugu (తిమ్మాపూర్, కరీంనగర్ జిల్లా): కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్లోని మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ బీసీ సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాల, కళాశాలలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి బీసీ గురుకులాల స్పోర్ట్స్ అండ్ గేమ్స్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఈ పోటీలను ప్రారంభించారు.
ఈ పోటీల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 15 పాఠశాలల నుంచి 9, 10 తరగతులు చదువుతున్న 525 మంది గురుకుల బాలికలు పాల్గొంటున్నారు. ఈ నెల 16వ తేదీ వరకు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ తదితర క్రీడాంశాల్లో పోటీలు జరగనున్నాయి.
ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే, క్రీడల్లో భారతదేశం మరిన్ని స్వర్ణ పతకాలు సాధించే దిశగా విద్యార్థులు ఇప్పటి నుంచే కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఒలింపిక్స్లో స్వర్ణమే లక్ష్యంగా పెట్టుకోవాలని ఆయన సూచించారు.
క్రీడల్లో ప్రతిభ కనబరిచే విద్యార్థులకు మెరుగైన శిక్షణ, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఆయన తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బూట్లు, సాక్సులు, టైలు అందిస్తున్నామని, క్రీడా రంగంలో ప్రోత్సాహకాలు కల్పిస్తున్నామని చెప్పారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీసీ గురుకులాల విద్యార్థులకు స్పోర్ట్స్ కిట్లు, ట్రాక్సూట్లు, షూస్ అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. క్రీడలు శారీరక దృఢత్వానికే కాకుండా మానసిక ఉల్లాసానికి, నాయకత్వ లక్షణాల అభివృద్ధికి దోహదపడతాయని పేర్కొన్నారు.
ప్రతిభ, పట్టుదల, ఏకాగ్రతతో పాటు పరస్పర స్నేహభావం, క్రమశిక్షణను క్రీడలు పెంపొందిస్తాయని ఎమ్మెల్యే అన్నారు. గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ, స్నేహపూర్వక వాతావరణంలో పోటీలు సాగాలని సూచించారు.
చదువుకు ఇచ్చినంత ప్రాధాన్యత క్రీడలకూ ఇవ్వాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆర్సీఓ అంజలీ దేవి, ప్రిన్సిపాల్ సరిత, వ్యవసాయ కళాశాల ప్రిన్సిపాల్ నరసింహా రెడ్డి, స్థానిక సర్పంచ్ పొన్నాల సంపత్, పాక్స్ చైర్మన్లు, మండల అధ్యక్షులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.




