బంగాళాఖాతంలో అల్పపీడనం, NewzFast Telugu (ఆంధ్రప్రదేశ్): ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల వాతావరణం తీవ్రంగా మారుతోంది. గత ఆరు నెలలుగా ఎండలు, ఎల్ నినో ప్రభావం, వర్షపాత లోటుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న తరుణంలో, వరుసగా రెండు తుఫాన్లు వచ్చి కష్టాలను మరింత పెంచాయి.
ఇప్పుడు ఆ ప్రభావం నుంచి కోలుకుంటున్న సమయంలో, బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నెల 13న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
ఈ అల్పపీడనం 24 గంటల్లో బలమైన అల్పపీడనంగా మారే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. దీని ప్రభావంతో ఈ నెల 14, 15 తేదీల్లో సముద్రంలో అలల ఉద్ధృతి ఎక్కువగా ఉండవచ్చని తెలిపారు.
ముఖ్యంగా అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలో అలల ఉద్ధృతి కారణంగా గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో 14, 15 తేదీల్లో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు.
వాతావరణ నిపుణుల అంచనా ప్రకారం, అల్పపీడనం బలపడి తుఫానుగా మారి కోస్తా తీరానికి చేరుకోవడానికి 8-10 రోజులు పట్టవచ్చు. ఇది తమిళనాడు వైపు వెళ్తుందా లేక ఆంధ్రప్రదేశ్ వైపు వస్తుందా అనే విషయం మరో 5-6 రోజుల్లో స్పష్టమవుతుందని చెబుతున్నారు.
ఈ ఏడాది ఇప్పటివరకు ఏర్పడిన వాయుగుండాలు, అల్పపీడనాలు తీరానికి చేరుకున్న తర్వాత ఉత్తర దిశగా వెళ్లాయని, కాబట్టి ఇది కూడా ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ అల్పపీడనం ప్రమాదకరమా కాదా అనేది తెలియాలంటే మరో ఐదారు రోజులు వేచి చూడాల్సి ఉంటుంది.




