ఆసియా కప్ అండర్ 19 ఫైనల్, NewzFast Telugu: ఆసియా కప్ అండర్ 19 2026 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఈ ఫైనల్‌లో టీమిండియా, పాకిస్తాన్ అండర్ 19 జట్లు తలపడనున్నాయి.
శనివారం ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి.
టీమిండియా అండర్ 19 జట్టు గెలుస్తుందని కొందరు అంటుంటే, పాకిస్తాన్ విజయం ఖాయమని మరికొందరు స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
భారత్, పాకిస్తాన్ మధ్య ఎప్పుడు, ఎక్కడ మ్యాచ్ జరిగినా ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తారని ఆయన అన్నారు.
అయితే ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుందని అక్తర్ అభిప్రాయపడ్డారు. తన అంచనా ప్రకారం పాకిస్తాన్‌పై భారత్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వివరించారు.
ఫైనల్‌లో భారత్‌ను ఎదుర్కోవడం పాకిస్తాన్ జట్టుకు పెద్ద సవాల్ అని ఆయన పేర్కొన్నారు.
సెమీ ఫైనల్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ను ఏకపక్షంగా ఓడించి భారత జట్టు ఫైనల్‌కు చేరిందని అక్తర్ ప్రశంసించారు. భారత దేశవాళీ క్రికెట్ వ్యవస్థ అత్యంత బలంగా ఉందని, 150 కోట్ల జనాభా కలిగిన దేశంలో చాలా మంది ప్రతిభావంతులైన క్రికెటర్లు వెలుగులోకి వస్తున్నారని ఆయన గుర్తు చేశారు.
వారిలో రాటుదేలినవారే రేపటి ఫైనల్‌లో ఆడుతున్నారని వివరించారు.
ఐపీఎల్ వంటి టోర్నమెంట్లలోనూ ఆకట్టుకుని అంతర్జాతీయ మ్యాచ్‌లకు చేరుతున్నారని ఆయన మెచ్చుకున్నారు. అయితే పాకిస్తాన్ క్రికెట్ జట్టులో అలాంటి పరిస్థితులు లేవని విమర్శించారు.
బౌలింగ్ బాగా చేస్తే బ్యాటింగ్ విఫలమవుతోందని, బ్యాటింగ్‌లో రాణిస్తే బౌలింగ్‌లో తేలిపోతున్నారని ఆయన అన్నారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రత్యేక చర్యలు తీసుకుంటేనే మెరుగైన ఫలితాలు వస్తాయని తెలిపారు.
రేపటి మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాళ్లు అద్భుతంగా ఆడాలని తాను కోరుకుంటున్నట్లు అక్తర్ పేర్కొన్నారు. ఫైనల్‌ను తేలికగా తీసుకోకుండా ప్రతి ఒక్కరూ రాణించాలని సూచించారు.
గ్రూప్ దశలో ఓడించినట్లుగానే ఫైనల్‌లోనూ భారత జట్టును చిత్తు చేయాలని ఆకాంక్షించారు.




