ఆశా వర్కర్ల ధర్నా, NewzFast Telugu (మక్తల్): తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్లు మక్తల్‌లోని మంత్రి వాకిటి శ్రీహరి క్యాంపు కార్యాలయం ముందు మంగళవారం మధ్యాహ్నం ఎర్రటి ఎండలో ధర్నా నిర్వహించారు. గత ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా తమ సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని మంత్రి వ్యక్తిగత కార్యదర్శికి అందజేశారు. ఆశా వర్కర్లకు నెలకు రూ.18 వేల వేతనం చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని వారు కోరారు.
విధి నిర్వహణలో మరణించిన ఆశా వర్కర్ల కుటుంబాలకు రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరిస్తామని గత ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిందని, ఇప్పటివరకు వాటిలో ఏ ఒక్కటీ పూర్తిస్థాయిలో అమలు కాలేదని వారు పేర్కొన్నారు.
సమస్యల పరిష్కారం కోసం విడతల వారీగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆశా వర్కర్లు తెలిపారు. సమస్యలు పరిష్కరించకపోతే తదుపరి కార్యాచరణ రూపొందించి ముట్టడి కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు.
ఈ ధర్నాలో సీపీఐ జిల్లా నాయకులు భరత్ కుమార్, గోవిందరాజ్, ఆశా వర్కర్ల మండల అధ్యక్షురాలు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీఐ రామలాల్ రాథోడ్, ఎస్సై రాజు పోలీసు సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కట్ట సురేష్ తదితరులు అక్కడ ఉన్నారు.




