అరుణాచలం కార్తీక దీపోత్సవం 2026, NewzFast Telugu (తిరువణ్ణామలై): తిరువణ్ణామలై శ్రీ అరుణాచలేశ్వర స్వామి ఆలయంలో 2026 కార్తీక దీపోత్సవం 17 రోజుల వేడుక నవంబర్ 12న ప్రారంభమైంది. ఈ ఉత్సవాలు నవంబర్ 28 వరకు కొనసాగుతాయి.
ఈ ఉత్సవాల్లో అత్యంత ప్రధానమైన మహాదీపం దర్శనం నవంబర్ 24, మంగళవారం సాయంత్రం 6 గంటలకు అరుణాచల కొండ శిఖరంపై వెలుగుతుంది. అంతకు ముందు నవంబర్ 12 నుంచి మూడు రోజుల పాటు గ్రామదేవత ఆరాధన జరుగుతుంది.
నవంబర్ 15న ధ్వజారోహణంతో 10 రోజుల కార్తీక బ్రహ్మోత్సవాలు అధికారికంగా ప్రారంభమవుతాయి. నవంబర్ 15 నుంచి 10 రోజుల పాటు ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం వివిధ వాహనాలపై పంచమూర్తులు భక్తులకు దర్శనమిస్తారు.
నవంబర్ 24 తెల్లవారుజామున 4 గంటలకు గర్భగుడిలో భరణి దీపాన్ని వెలిగిస్తారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు 2668 అడుగుల ఎత్తైన అరుణాచల శిఖరంపై మహాదీపాన్ని వెలిగిస్తారు.
మహాదీపం తర్వాత మూడు రోజుల పాటు తెప్పోత్సవాలు నిర్వహించి, ఆఖరి రోజు చండికేశ్వర ఉత్సవంతో వేడుకలు ముగుస్తాయి. నవంబర్ 12 నుంచి 28 వరకు రోజువారీ వాహన సేవల వివరాలు ఇలా ఉన్నాయి: నవంబర్ 15 నంది వాహన సేవ, నవంబర్ 16 సూర్య, ఇంద్ర విమాన వాహన సేవలు, నవంబర్ 17 భూత, సింహ వాహన సేవలు, నవంబర్ 18 సర్ప, కల్పవృక్ష, కామధేను వాహన సేవలు.
నవంబర్ 19న వృషభ వాహన సేవ, నవంబర్ 20న 63 నాయనార్లు, గజ వాహనం, వెండి రథం, నవంబర్ 21న పంచమూర్తుల పంచ మహారథాల ఊరేగింపు, నవంబర్ 22న అశ్వ వాహనం, భిక్షాటనమూర్తి, పంచకన్య వాహన సేవలు జరుగుతాయి. నవంబర్ 23న పురుషామృగ, రావణ వాహన సేవలు నిర్వహిస్తారు.
నవంబర్ 25న చంద్రశేఖరమూర్తి తెప్పోత్సవం, నవంబర్ 26న గిరి ప్రదక్షిణ, పరాశక్తి తెప్పోత్సవం, నవంబర్ 27న సుబ్రహ్మణ్యస్వామి తెప్పోత్సవం జరుగుతాయి. నవంబర్ 28న చండేశ్వరుడి మూడు వేధుల ఊరేగింపుతో ఉత్సవాలు ముగుస్తాయి.
గిరి ప్రదక్షిణ వారంలోని రోజులను బట్టి వేర్వేరు ఫలితాలను ఇస్తుందని భక్తులు నమ్ముతారు. ఆదివారం శివలోక ప్రాప్తి, సోమవారం పూర్ణ ఆరోగ్యం, మంగళవారం ఋణ విముక్తి, బుధవారం సరస్వతి ప్రసన్నత, గురువారం గురుత్వం, శుక్రవారం లక్ష్మీ కటాక్షం, శనివారం గ్రహదోష విముక్తి లభిస్తాయని చెబుతారు.
భద్రతా కారణాల దృష్ట్యా మహాదీపం వెలిగించే నవంబర్ 24న భక్తులను అరుణాచల కొండపైకి అనుమతించరు. మహాదీపం వెలిగిన తర్వాత వచ్చే పౌర్ణమి రోజున లక్షలాది భక్తులు 14 కిలోమీటర్ల మేర గిరి ప్రదక్షిణ చేస్తారు.
ఆ రోజు రద్దీని దృష్టిలో ఉంచుకుని బస్సులు, రైల్వే రిజర్వేషన్లు, వసతి గదులను ముందుగానే బుక్ చేసుకోవడం మంచిది.




