APPSC గ్రూప్ 2 నోటిఫికేషన్, NewzFast Telugu (ఆంధ్రప్రదేశ్): ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఈరోజు 720 పోస్టులతో గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో ఎగ్జిక్యూటివ్ మరియు నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి.
దరఖాస్తు ప్రక్రియ కూడా ఈరోజు నుంచే ప్రారంభమైంది.
దరఖాస్తులు డిసెంబర్ 11 వరకు స్వీకరిస్తారు. ఆ తర్వాత గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్ వచ్చే ఏడాది ఫిబ్రవరి 21న నిర్వహించనున్నారు.
నోటిఫికేషన్లో మున్సిపల్ కమిషనర్లు, డిప్యూటీ ఎంపీడీవోలు, డిప్యూటీ తహసీల్దార్లు, సబ్ రిజిస్ట్రార్లు, జీఎస్టీ అధికారులు, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు, సీనియర్ అకౌంటెంట్లు, జూనియర్ అకౌంటెంట్లు వంటి పోస్టులు ఉన్నాయి. కేటగిరీల వారీగా ఎగ్జిక్యూటివ్ పోస్టులు 471, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు 249 ఉన్నాయి.
ఎగ్జిక్యూటివ్ విభాగంలో మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-3 పోస్టులు 6, డిప్యూటీ మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టులు 176, అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ పోస్టులు 10, డిప్యూటీ తహసీల్దార్ పోస్టులు 203, సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్-2 పోస్టులు 7, జీఎస్టీ ఆఫీసర్ పోస్టులు 40, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు 29 ఉన్నాయి.
నాన్ ఎగ్జిక్యూటివ్ విభాగంలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (జీఏడీ) పోస్టులు 71, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఫైనాన్స్) పోస్టులు 5, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (లా) పోస్టులు 4, సీనియర్ అకౌంటెంట్ (హెచ్ఓడీలు) పోస్టులు 90, సీనియర్ అకౌంటెంట్ (జిల్లాలు) ఒక పోస్టు, జూనియర్ అకౌంటెంట్ పోస్టులు 47, ఇతర శాఖల్లో జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు 31 ఉన్నాయి.
విద్యార్హతగా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ నిర్ణయించారు. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (లా) పోస్టుకు లా డిగ్రీ అవసరం.
సీనియర్ అకౌంటెంట్ పోస్టులకు కామర్స్, ఎకనామిక్స్ లేదా మ్యాథమెటిక్స్ డిగ్రీతో పాటు కంప్యూటర్ సంబంధిత సర్టిఫికెట్ లేదా నిర్దేశించిన కంప్యూటర్ అర్హత కావాలి. జూనియర్ అకౌంటెంట్ పోస్టులకు డిగ్రీ అవసరం, కామర్స్, మ్యాథమెటిక్స్ లేదా ఎకనామిక్స్ అభ్యర్థులకు ప్రాధాన్యత ఇస్తారు.
2026 జులై 1 నాటికి పోస్టును బట్టి కనీస వయోపరిమితి 18, 20 లేదా 21 సంవత్సరాలు, గరిష్ఠ వయోపరిమితి 30 లేదా 44 సంవత్సరాలుగా నిర్ణయించారు. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు వయోపరిమితి 18 నుంచి 30 సంవత్సరాలు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్లు, మాజీ సైనికులకు నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది. ఏపీ ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగులకు గరిష్ఠంగా ఐదేళ్ల వరకు సడలింపు ఇస్తారు.
జీతభత్యాలు పోస్టును బట్టి మారతాయి. మున్సిపల్ కమిషనర్, డిప్యూటీ ఎంపీడీవో, అసిస్టెంట్ రిజిస్ట్రార్ పోస్టులకు రూ.45,830 నుంచి రూ.1,30,580 వరకు, డిప్యూటీ తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్, జీఎస్టీ ఆఫీసర్ పోస్టులకు రూ.44,570 నుంచి రూ.1,27,480 వరకు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులకు రూ.40,970 నుంచి రూ.1,24,380 వరకు, సీనియర్ అకౌంటెంట్ పోస్టులకు రూ.34,580 నుంచి రూ.1,07,210 వరకు, జూనియర్ అకౌంటెంట్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు రూ.25,220 నుంచి రూ.80,910 వరకు ఉంటాయి.
అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు రూ.250, పరీక్ష ఫీజు రూ.80 కలిపి మొత్తం రూ.330 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, మాజీ సైనికులు, తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబాల అభ్యర్థులకు, నిరుద్యోగ యువతకు 80 రూపాయల పరీక్ష ఫీజు మినహాయింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియలో స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్ పరీక్ష, కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ (CPT) ఉంటాయి.
దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు ఏపీపీఎస్సీ అధికారిక వెబ్సైట్ psc.ap.gov.in లోకి వెళ్లాలి. ఇప్పటికే OTPR ఐడీ ఉన్నవారు యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్ కావాలి.
తొలిసారి దరఖాస్తు చేసేవారు ముందుగా వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. తర్వాత నోటిఫికేషన్ నంబర్ 37/2026కు సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్‌ను ఎంచుకుని విద్యార్హతలు, స్థానికత, రిజర్వేషన్ వివరాలు, పోస్టుల ప్రాధాన్యతలు, పరీక్ష కేంద్రాలను నమోదు చేయాలి.
వివరాలు పరిశీలించి సేవ్ అండ్ సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి.
ఆన్లైన్లో ఫీజు చెల్లించిన తర్వాతే దరఖాస్తు పూర్తవుతుంది. అప్లికేషన్ కాపీని డౌన్లోడ్ చేసుకుని భద్రపరుచుకోవాలని అభ్యర్థులకు సూచన.




