పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు, NewzFast Telugu (అమరావతి): రాష్ట్రంలో మిగిలిన 23 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో ఆయా పట్టణ ప్రాంతాల్లో తక్షణమే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది.
ఈ నెల 26న పోలింగ్, అవసరమైతే 27న రీపోలింగ్, 30న ఓట్ల లెక్కింపు మరియు ఫలితాల ప్రకటన ఉంటాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా తెలిపారు. పరోక్ష ఎన్నికలను డిసెంబర్ 5, 6 తేదీల్లో నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.
ఈ ఎన్నికలు శ్రీకాకుళం, కాకినాడ, రాజమహేంద్రవరం, మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్లతో పాటు ఆమదాలవలస, రాజాం, పాలకొల్లు, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, చింతలపూడి, గుడివాడ, తాడిగడప, పొన్నూరు, నరసరావుపేట, బాపట్ల, కందుకూరు, పొదిలి, కావలి, గూడూరు, అల్లూరు, శ్రీకాళహస్తి, బి కొత్తకోట మున్సిపాలిటీలు మరియు నగర పంచాయతీల్లో జరగనున్నాయి.
ఈ నెల 14న ఎన్నికల అధికారులు నోటీసులు జారీ చేస్తారు. 16వ తేదీ నామినేషన్ల దాఖలుకు చివరి గడువు కాగా, 17న వాటి పరిశీలన చేపడతారు. 19న ఉపసంహరణ గడువు ముగిసిన అనంతరం తుది అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు.
గ్రామ పంచాయతీ ఎన్నికలను మూడు దశల్లో నిర్వహించనున్నట్లు కమిషనర్ తెలిపారు. మొదటి విడత నోటిఫికేషన్ ఈ నెల 13న విడుదల చేసి, 26న పోలింగ్ చేపడతారు.
రెండో విడత ప్రకటన 16న, ఓటింగ్ 29న; మూడో విడత నోటిఫికేషన్ 19న, ఎన్నికలు డిసెంబర్ 2న నిర్వహిస్తారు.
ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు మరియు ఇతర అధికారులతో కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, ప్రశాంత వాతావరణంలో ప్రక్రియ పూర్తయ్యేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
నామినేషన్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్లు, ఓట్ల లెక్కింపు ప్రదేశాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, అభ్యర్థులకు భద్రత కల్పించాలని స్పష్టం చేశారు.
ఈ నెల 14న తిరుపతిలో 12 జిల్లాల ఎస్పీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు కమిషనర్ తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఎన్నికల కార్యదర్శి ఎ మల్లికార్జున, ఐజి బి రాజకుమారి, మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ అదనపు డైరెక్టర్ రవీంద్రబాబు పాల్గొన్నారు.




