ఏపీ రేషన్ కార్డు నిత్యావసరాలు రాయితీ, NewzFast Telugu (ఆంధ్రప్రదేశ్): రాష్ట్రంలోని రేషన్ కార్డు ఉన్నవారికి సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం శుభవార్త అందించింది. రాష్ట్రవ్యాప్తంగా పేదలకు నిత్యావసర వస్తువులను రాయితీపై పంపిణీ చేయాలని నిర్ణయించింది.
ప్రైవేట్ మార్కెట్లో నిత్యావసర ధరలు పెరుగుతుండటంతో మధ్య తరగతి, పేద వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణపై సీఎం చంద్రబాబు నాయుడు ఇటీవల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ధరల నియంత్రణకు చర్యలు తీసుకుని రాయితీపై ప్రజలకు అందించాలని అధికారులను ఆదేశించారు. అదే విధంగా కేబినెట్ సబ్ కమిటీలోనూ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
దీంతో డిసెంబర్ నెల నుంచి మూడు నెలల పాటు రేషన్ కార్డు లబ్ధిదారులకు రాయితీపై సరుకులు పంపిణీ చేయనున్నారు.
రేషన్ షాపుల ద్వారా కార్డు ఉన్నవారికి కిలో కందిపప్పు రూ.100, గోధుమపిండి రూ.25, లీటరు పామాయిల్ రూ.125 చొప్పున అందించనున్నారు. ఈ సబ్సిడీ పథకం అమలుకు నెలకు సుమారు రూ.100.20 కోట్లు ఖర్చవుతుందని అంచనా.
మూడు నెలలకు కలిపి సుమారు రూ.300.60 కోట్ల భారం పడనుంది.
ధరల స్థిరీకరణ నిధి కింద రాష్ట్ర ప్రభుత్వం 1.20 లక్షల టన్నుల కందులు కేటాయించాలని కేంద్రాన్ని కోరగా, కేంద్రం 40,338 టన్నులు కేటాయించింది. ముడికందుల లభ్యతకు అనుగుణంగా సేకరణతో పాటు పప్పు తయారీ ఒప్పందాలు చేసుకోవాలని పౌరసరఫరాల సంస్థ ఎండీ, వీసీకి పౌరసరఫరాల శాఖ కమిషనర్ కన్నబాబు ఆదేశాలు జారీ చేశారు.
పామాయిల్ సేకరించాలని, మూడు నెలల తర్వాత ఈ రాయితీ కార్యక్రమాన్ని పొడిగించాల్సి వస్తే ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.




