ఏపీ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు, NewzFast Telugu: కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా జిల్లా పరిషత్, ఎంపీపీ ఎన్నికలు జరుగుతున్నాయి. గురువారం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ మొదలైంది.
రాష్ట్రవ్యాప్తంగా 659 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా, ఇప్పటికే 77 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 582 స్థానాలకు ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతోంది.
ఈ ఎన్నికల్లో 2,169 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
పార్టీల వారీగా చూస్తే వైసీపీ నుంచి అత్యధికంగా 574 మంది, టీడీపీ నుంచి 452 మంది, కాంగ్రెస్ నుంచి 270 మంది, జనసేన నుంచి 109 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. దీంతో పాటు 503 మంది స్వతంత్ర అభ్యర్థులు కూడా బరిలో నిలిచారు.
ఎంపీటీసీ స్థానాల విషయానికి వస్తే, మొత్తం 9,829 స్థానాల్లో 2,043 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 7,844 స్థానాలకు గురువారం పోలింగ్ జరుగుతోంది.
ఎంపీటీసీ ఎన్నికల్లో మొత్తం 18,952 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.
పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరారు. పరిషత్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసింది.
రాయలసీమలోని సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలు మోహరించాయి.
వరుస తుఫాన్లు, భారీ వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ వాయిదా పడింది. ఉమ్మడి పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాల్లోని పలు మండలాల్లో పోలింగ్‌ను శుక్రవారానికి వాయిదా వేసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది.
ఓట్ల లెక్కింపు అన్ని చోట్లా శనివారం జరగనుంది.
