AP MPTC ZPTC ఎన్నికల ఫలితాలు, NewzFast Telugu: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాల కోసం అభ్యర్థులు, రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల ప్రచారం ముగియగా, ఓటర్ల తీర్పు మరికొన్ని గంటల్లో వెలువడనుంది.
రాష్ట్రవ్యాప్తంగా 28 జిల్లాల్లోని 365 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది.
ఈ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 70.72 శాతం పోలింగ్ నమోదైంది. భారీ వర్షాలు, వరదల కారణంగా వాయిదా పడిన 5 మండలాల్లోనూ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.
మరో 3 జిల్లాల్లో వివిధ కారణాలతో తిరిగి పోలింగ్ నిర్వహించాల్సి వచ్చింది.
తొలి ఫలితం వెలువడేందుకు కనీసం నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉందని అంచనా. దీంతో ఉదయం నుంచే కౌంటింగ్ కేంద్రాల వద్ద సందడి కనిపించనుంది.
ఎన్నికల సంఘం సజావుగా ప్రక్రియ సాగేందుకు పక్కా ఏర్పాట్లు చేసింది. 11 వేలకు పైగా కౌంటింగ్ సూపర్వైజర్లు, 28,500 మంది కౌంటింగ్ సిబ్బంది, సహాయకులు లెక్కింపు బాధ్యతలు చేపట్టనున్నారు. కేంద్రాల వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
