ఏపీ పెట్టుబడులు, NewzFast Telugu (విశాఖపట్నం): ఆంధ్రప్రదేశ్‌లో ముందు పెట్టుబడులు పెట్టాలని, ఆ తరువాత కంపెనీ ప్రధాన కార్యాలయాన్ని ఇక్కడకు తరలించాలని మంత్రి నారా లోకేశ్ పెట్టుబడిదారులకు పిలుపునిచ్చారు. పరిశ్రమల ఏర్పాటుకు మాత్రమే పరిమితం కాకుండా రాష్ట్రాన్ని కార్పొరేట్ హోమ్‌గా మార్చుకోవాలని ఆయన కోరారు.
విశాఖపట్నంలో గురువారం ప్రారంభమైన సీఐఐ భాగస్వామ్య పెట్టుబడిదారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏ రంగాన్ని ఎంచుకున్నా ప్రభుత్వ సహకారం పూర్తిగా ఉంటుందని, వ్యాపారానికి నమ్మకం ప్రధానమని ఆయన పేర్కొన్నారు.
ఒకసారి ప్రాజెక్టు గ్రౌండింగ్ జరిగితే దానిని ప్రభుత్వం సొంత ప్రాజెక్టులా చూసుకుంటుందని తెలిపారు.
రాష్ట్రంలో వేయి కిలోమీటర్లకు పైగా తీర ప్రాంతం, వంద మిలియన్ టన్నుల సరుకు రవాణా సామర్థ్యం గల విశాఖ పోర్టు ఉన్నాయని ఆయన వివరించారు. రామాయపట్నం, మూలపేట, మచిలీపట్నం, కాకినాడల్లో గ్రీన్‌పోర్టులు నిర్మాణంలో ఉన్నాయని చెప్పారు.
అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం పూర్తయిందని, అక్కడ భారీ బోయింగ్ విమానాలు రాకపోకలు సాగించగలవని తెలిపారు.
భారత్‌లో అమ్ముడవుతున్న ఏసీల్లో 60 శాతం శ్రీసిటీలో తయారవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. సముద్ర ఆహార ఉత్పత్తుల్లో 80 శాతం రొయ్యలు ఇక్కడి నుంచే ఎగుమతి అవుతున్నాయని, దేశంలో 50 శాతానికి పైగా కోకో ఇక్కడే పండుతోందని చెప్పారు.
ఎండుమిర్చిలో 40 శాతం గుంటూరు నుంచి సరఫరా అవుతోందని, గుడ్ల ఉత్పత్తిలో రాష్ట్రం దేశంలో నంబర్‌వన్‌గా ఉందని వివరించారు.
విశాఖపట్నం ఐటీ నగరంగా అభివృద్ధి చెందుతోందని, కాగ్నిజెంట్, టీసీఎస్ వంటి పెద్ద సంస్థలు కార్యకలాపాలు ప్రారంభించాయని ఆయన తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఈ ఏడాది అక్టోబరు వరకు రూ.22.6 లక్షల కోట్ల విలువైన పెట్టుబడి ఒప్పందాలు జరిగాయని చెప్పారు.
వీటిలో 73 శాతం, అంటే రూ.17.2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు అనుమతులు లభించాయని, వీటి ద్వారా 12.7 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని, వాటిలో 51 శాతం గ్రౌండింగ్ అయ్యాయని ఆయన వివరించారు.
ప్రభుత్వం ‘స్పీడ్, స్టెబిలిటీ, సర్వీసెస్’ అనే మూడు విధానాలను అనుసరిస్తోందని లోకేశ్ పేర్కొన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌గా మార్చామని, పాలసీలను తరచూ మార్చకుండా స్థిరంగా ఉంచుతున్నామని తెలిపారు.
ప్రాజెక్టు ప్రారంభించిన తర్వాత ఏ సమస్య వచ్చినా ఫోన్ కాల్ దూరంలోనే ప్రభుత్వం ఉంటుందని చెప్పారు.
సదస్సులో ఎస్‌ఎల్‌ఎన్ కాఫీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.శతప్పన్‌తో కూడా లోకేశ్ సమావేశమయ్యారు. మిడిల్ ఈస్ట్, యూరప్, ఆగ్నేయాసియా, రష్యా వంటి అంతర్జాతీయ మార్కెట్ల కోసం ప్రీమియం అరకు కాఫీని సేకరించాలని ఆయన కోరారు.
అరకు కాఫీ ప్రాసెసింగ్, మార్కెటింగ్, పంపిణీ కోసం ఏపీ గిరిజన కార్పొరేషన్‌తో కలిసి పనిచేయాలని, జాతీయ రహదారులు, ప్రధాన పట్టణాల్లో లెవిస్టా కేఫ్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు.




