ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు, NewzFast Telugu (విశాఖపట్నం): విశాఖపట్నంలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు తొలిరోజునే పెట్టుబడుల వరద ప్రవహించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, కియా వంటి దిగ్గజ కంపెనీలు ముందుకు రావడంతో సదస్సు ప్రాంగణంలో పండగ వాతావరణం కనిపించింది.
జనరల్ మాన్యుఫ్యాక్చరింగ్ రంగంలో రూ.2,73,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ ముందుకొచ్చింది. తూర్పు గోదావరి జిల్లాలో ఈ ప్రాజెక్టును ఆ సంస్థ చేపట్టనుంది.
సదస్సు తొలిరోజున మొత్తం 88 ప్రతిపాదనలు వచ్చాయి.
73 సంస్థలతో రూ.5,84,355 కోట్ల పెట్టుబడుల లక్ష్యంతో అవగాహన ఒప్పందాలు కుదిరాయి. వీటి ద్వారా 1,07,693 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.
ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం 15 జీవోలు జారీ చేసింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి లోకేశ్ సమక్షంలో ప్రముఖ కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో పాటు గ్రీన్కో ఎనర్జీస్, క్లీన్‌మ్యాక్స్ ఎన్విరో ఎనర్జీ సొల్యూషన్స్, మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రా, కియా ఇండియా తదితర సంస్థలు ఇందులో ఉన్నాయి.
అత్యధికంగా జనరల్ మాన్యుఫ్యాక్చరింగ్ రంగంలో 23 ఎంఓయూలు కుదిరాయి. వీటి ద్వారా రూ.3,57,386 కోట్ల పెట్టుబడులకు సంతకాలు జరిగాయి.
ఈ రంగంలో 44,838 మందికి ఉపాధి లభించనుంది. రష్మి మెటలర్జీకల్ ఇండస్ట్రీస్ రూ.18,500 కోట్లు, జెఎస్డబ్ల్యూ రూ.15,000 కోట్లు పెట్టనున్నాయి.
రెన్యువబుల్ ఎనర్జీ రంగంలో ఏడు ఎంఓయూల ద్వారా రూ.1,65,020 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. గ్రీన్కో ఎనర్జీస్ రూ.45,000 కోట్లు, క్లీన్‌మ్యాక్స్ ఎన్విరో రూ.41,000 కోట్లు, కృష్ణా జిల్లాలో మేఘా ఇంజినీరింగ్ రూ.36,000 కోట్లు పెడుతున్నాయి.
ఈ రంగంలో 16,600 మందికి కొత్తగా ఉద్యోగాలు రానున్నాయి.
కెమికల్స్ అండ్ పెట్రో కెమికల్స్ రంగంలో ఆరు ఎంఓయూల ద్వారా రూ.19,995 కోట్ల పెట్టుబడులు, 3,127 ఉద్యోగాలు వస్తాయి. గెయిల్ ఇండియా శ్రీకాకుళంలో రూ.13,500 కోట్లు, ఎన్ఏఎన్ మ్యాగ్నాటెక్ నెల్లూరులో రూ.3,000 కోట్లు పెడతాయి.
ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఐదు ఎంఓయూల ద్వారా రూ.4,770 కోట్ల పెట్టుబడులు, 2,847 ఉద్యోగాలు వస్తాయి. ఎస్ఎల్ఎన్ కాఫీ నెల్లూరులో రూ.2,500 కోట్లు, హిందూస్థాన్ కోకా-కోలా బేవరేజెస్ రూ.1,127 కోట్లు పెట్టనున్నాయి.
ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, మంత్రులు గొట్టిపాటి రవికుమార్, కొల్లు రవీంద్ర, డోలా బాలవీరాంజనేయ స్వామి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.




