ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు, NewzFast Telugu (ఆంధ్రప్రదేశ్): ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పారిశ్రామిక రంగం కొత్త పుంతలు తొక్కుతోందని, రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని భీమిలి శాసనసభ్యుడు గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వం, పారిశ్రామిక అనుకూల విధానాలపై నమ్మకంతో దేశ విదేశీ పారిశ్రామికవేత్తలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.
గత వైసీపీ పాలనలో తీసుకున్న నిర్ణయాలు, పారిశ్రామికవేత్తలపై వేధింపుల కారణంగా రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని గంటా విమర్శించారు. పెట్టుబడిదారుల్లో నమ్మకం సన్నగిల్లడంతో జగన్ హయాంలో దాదాపు రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రం దాటి వెళ్లిపోయాయని ఆరోపించారు.
ఆ ఐదేళ్ల కాలంలో ఒకే ఒక్క పెట్టుబడుల సదస్సు మాత్రమే నిర్వహించారని ఆయన గుర్తుచేశారు.
అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్ల వ్యవధిలోనే రెండుసార్లు CII భాగస్వామ్య సదస్సులను విజయవంతంగా నిర్వహించి, రూ.26 లక్షల కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి ఆకర్షించిందని గణాంకాలతో వివరించారు. ఈ తేడాను ప్రజలు గమనిస్తున్నారని ఆయన అన్నారు.
రాష్ట్ర యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం కార్యాచరణ అమలు చేస్తోందని గంటా తెలిపారు. ఇప్పటికే 8 లక్షలకు పైగా ఉద్యోగాల కల్పన దిశగా కీలక ముందడుగు పడిందన్నారు.
దేశంలోనే అత్యుత్తమమైన 28 నూతన పారిశ్రామిక విధానాలను ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, ఫలితంగా ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు స్వర్గధామంగా మారుతోందని ఆయన పేర్కొన్నారు.




