ఏపీ పారిశ్రామిక అభివృద్ధి, NewzFast Telugu (ఆంధ్రప్రదేశ్): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో భారత పర్యటనలో ఉన్న జపాన్ రాయబారి కెయిచీ ఓనో, వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ (WIPO) డైరెక్టర్ డారెన్ టాంగ్ వేర్వేరుగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి, పెట్టుబడులు, సాంకేతికత, మేథోసంపత్తి హక్కుల విస్తరణపై ఈ భేటీల్లో సుదీర్ఘంగా చర్చించారు.
జపాన్ రాయబారితో జరిగిన సమావేశంలో రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబడులు, నైపుణ్యాభివృద్ధి మరియు మౌలిక వసతుల కల్పనపై ప్రధానంగా చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు జపాన్ కంపెనీలు తీవ్ర ఆసక్తి చూపుతున్నాయని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
పరిశ్రమల ఏర్పాటుకు వేగవంతమైన అనుమతులతో పాటు పారదర్శకంగా రాయితీలు అందిస్తున్నామని తెలిపారు.
జపాన్ పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా రాష్ట్ర యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. ప్రపంచ ప్రఖ్యాత సంస్థలైన సుజుకి, హోండా, కోమాట్సు, కవసాకి, యమహా వంటి కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కోరారు.
మచిలీపట్నం షిప్‌బిల్డింగ్ క్లస్టర్‌లో భాగస్వాములు కావాలని జపాన్ ప్రతినిధులను ఆహ్వానించారు.
ఏఎం, ఎన్‌ఎస్ ఇండియా స్టీల్‌ప్లాంట్‌కు అవసరమైన నీరు, ఇతర మౌలిక సదుపాయాలను త్వరితగతిన కల్పిస్తామని స్పష్టం చేశారు. భారత్-జపాన్ సంయుక్త సహకారంతో విశాఖపట్నంలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్‌ను ప్రారంభించబోతున్నట్లు ప్రకటించారు.
ఇదే సమయంలో గ్రీన్ అమ్మోనియా కొనుగోలుకు సంబంధించి జెరా (JERA), ఏఎం గ్రీన్ (AM Green) సంస్థల మధ్య ప్రాథమిక ఒప్పందం కుదిరినట్లు ముఖ్యమంత్రి వివరించారు.
వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ డారెన్ టాంగ్‌తో జరిగిన మరో సమావేశంలో నూతన స్టార్టప్‌లకు మేథోసంపత్తి హక్కుల (Intellectual Property Rights) కల్పనపై ముఖ్యమంత్రి చర్చించారు. రాష్ట్రంలో టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా నూతన ఆలోచనలను, స్టార్టప్ కంపెనీలను విశేషంగా ప్రోత్సహిస్తున్నామని ఆయన వివరించారు.
యువతలో కొత్త ఆవిష్కరణలు, పరిశోధనలను ప్రోత్సహించేందుకు డబ్ల్యూఐపీవో తమ వంతు సహకారాన్ని అందించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.




