అమిత్ షా విశాఖ పర్యటన రద్దు, NewzFast Telugu (విశాఖపట్నం): ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం వేదికగా గురువారం ప్రతిష్టాత్మక 31వ సీఐఐ (CII) భాగస్వామ్య సదస్సు ప్రారంభం కానుంది. ఈ సదస్సుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గైర్హాజరు కానున్నారు.
అనివార్య కారణాల వల్ల ఆయన విశాఖ పర్యటన రద్దయినట్లు కేంద్ర హోంశాఖ అధికారికంగా ప్రకటించింది. దీంతో అమిత్ షా స్థానంలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
ఈ సదస్సు కోసం విశాఖ నగరం ఇప్పటికే సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ప్రపంచవ్యాప్తంగా తరలివస్తున్న పారిశ్రామిక దిగ్గజాలు, వాణిజ్య ప్రతినిధులకు సీఎం చంద్రబాబు నాయుడు సాదర స్వాగతం పలికారు.
సదస్సు నిర్వహణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు.
ఏపీని పారిశ్రామికంగా, ఆర్థికంగా ఉన్నత శిఖరాలకు చేర్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడులను ఆకర్షించడమే ధ్యేయంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
దేశ, విదేశాలకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తలు, కేంద్ర, రాష్ట్ర నాయకులు ఒకే వేదికపైకి వచ్చి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలపై చర్చించనున్నారు.




